కామారెడ్డి, బతుకమ్మ : మైనర్ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తికి జిల్లా కోర్టు 20 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధించిందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. ఎస్పీ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి భార్యపిల్లలతో 2022 ఆగస్టు 2న తన ఇంట్లో నిద్రించాడు. అయితే తెల్లారేసరికి అతని 14 ఏళ్ళ మైనర్ కూతురు కనిపించలేదు. స్థానికంగా చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో గాలించి లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లింగంపేట్ మండలం గాంధీనగర్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అక్కరేని శ్రీకాంత్(20) సంవత్సరాల యువకుడు మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని ఫోన్ నంబర్ తీసుకుని తరుచు వేదించేవాడు. తల్లిదండ్రులతో నిద్రిస్తున్న బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లి మేడ్చల్ జిల్లా డబిల్ పూర్ వద్ద బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక మిస్సింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అదే నెల 16న నిందితుడు అయిన శ్రీకాంత్ లింగంపేట్ లో వదిలి వెళ్లగా ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం ఫోక్సో కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కేసులో వాదోపవాదలు విన్న కామారెడ్డి జిల్లా న్యాయమూర్తి సి.హెచ్.వరప్రసాద్ తీర్పు వెలువరించారు. నిందితుడు అయిన శ్రీకాంత్ కు 20 సంవత్సరాల కఠినకారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును పోలీసుల తరపున వాదించిన పీపీ కే.శేషు, అప్పటి ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, ప్రస్తుత డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎస్సై వెంకట్ రావులతో పాటు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రాజయ్య, ఏఎస్సై రామేశ్వర్ రెడ్డిలను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.