Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 February 2025, 8:14 pm Posted by : ramakrishna

ఫారెస్ట్ ఆఫీసర్ గంగయ్య హత్యకేసులో ఒకరికి జీవితఖైదు

  • 13 మందికి జీవితఖైదు నుండి విముక్తి
  • 23 మందిని నిర్దోషులుగా విడుదల
  • దోషుల అప్పీలులోతెలంగాణ రాష్ట్ర హైకోర్టు తీర్పు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగయ్య హత్యకేసు,ఇతర ఫారెస్ట్ సిబ్బంది పై హత్యాయత్నం కేసులలో నల్లవెళ్లి గ్రామానికి చెందిన వడ్డె భాస్కర్ తదితరులపై నేర నిర్ధారణ చేస్తు నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాలను విచారించే ప్రత్యేక న్యాయస్థానం 25 సెప్టెంబర్,2017 న మొత్తం 37 మంది ముద్దాయిలలో 14 మందికి జీవిత కారాగార శిక్ష విధిస్తు తీర్పు వెలువరించింది.నాటి ధర్పల్లి మండలం నల్లవెళ్లి గ్రామ శివారులోని పెద్ద బండ ఫారెస్ట్ భూమిలో ట్రాక్టర్లతో చదును చేసి అక్రమించుకుంటున్నారనే సమాచారంతో 14 సెప్టెంబర్,2013 న అక్కడికి వెళ్లిన గంగయ్యను హత్యచేసి,ఇతర సిబ్బందిపై హత్యాయత్నం చేసి,ఇతర అభియోగాలు ఉండేవి.నేర విచారణ చేసి 14 మందికి జీవితఖైదు విధించిన విషయం విదితమే. ప్రధాన ముద్దాయి వడ్డె భాస్కర్, దోష నిర్ధారణ అయిన మరో 13 మంది రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు దాఖలు చేశారు. గురువారం తీర్పు వెలువరించిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన దోషిగా తేలిన భాస్కర్ కు జీవిత కారాగార శిక్షకు ఖారారు చేసింది.మిగతా 13 మందిని దోష విముక్తులను చేస్తు నిర్దోషులుగా విడుదల చేస్తూ అప్పీలును పరిష్కరించింది.