. . . కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్
మెండోర, బతుకమ్మ :
ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం కంటే నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా కనీస బాధ్యతలు నిర్వర్తించాలని సూచించారు. మెండోర మండల కేంద్రంలోని రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2017 మే నెలలో ప్రారంభమైన ఈ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడం పట్ల ప్రశ్నించారు. గతంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యేగా మూడు సంవత్సరాలు గడిచినా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించలేకపోయారని విమర్శించారు. రెండు పడక గదుల సముదాయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని అన్నారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన సమయంలో విమర్శలకే పరిమితం కావడం సరికాదని అన్నారు. ప్రభుత్వ పెద్దలను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించి పరిష్కారానికి కృషి చేయాలని ప్రశాంత్ రెడ్డికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై తాను బాధ్యతగా మండల రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే ఈ సమావేశాలపై ఎమ్మార్వోల విషయంలో జిల్లా కలెక్టర్‌కు ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు చేయడం సరికాదని విమర్శించారు. “ఆయన పని చేయరు.. పని చేసేవారిని చేయనివ్వరు” అంటూ ఆరోపించారు. ప్రజల కోసం ప్రశాంత్ రెడ్డి పిలిస్తే ఎలాంటి భేషజాలు లేకుండా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే ఎలాంటి పనులు చేయకుండా పదేపదే తప్పుడు విమర్శలు చేస్తే బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.