Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 6:12 pm Posted by : ramakrishna

వృద్ధుడి హత్య కేసులో ఒకరికి జీవిత ఖైదు

 

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

 

అరవై ఐదేళ్ల వృద్ధుడిని హత్య చేసిన కేసులో ముద్దాయి సోమ నవీన్ రెడ్డి కి జీవిత కారాగార శిక్ష, ఎస్ సి,ఎస్ టి అత్యాచారాల చట్టంలోని సెక్షన్ 3(2)(వి) షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందున ఐదు సంవత్సరాల కఠిన జైలు శిక్ష విదిస్తూ నిజామాబాద్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ సెషన్స్ జడ్జి సుగాలి నారాయణ సోమవారం తీర్పు చెప్పారు. కోర్టు వెలువరించిన తీర్పులోని వివరాలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కోర్టుకు సమర్పించిన నేర అభియోగ పత్రం అదారంగా కోర్టు నేర న్యాయ విచారణలో మొత్తం పన్నెండు మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, పన్నెండు ధ్రువీకరించుకున్న పత్రాలు, ఏడు వస్తుగత సాక్ష్యాలు మార్క్ చేసుకున్న అనంతరం… మెండోరా మండలం బుస్సపూర్ గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల వయసు గల సుద్దపల్లి లింగన్న 27 ఆగస్టు, 2021 న పొద్దున తెల్లవారు జామున గ్రామ బస్ స్టాండ్ వద్ద గల రాజస్థాన్ హోటల్ దగ్గరకు ఛాయ్ తాగడానికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ కుంచపు బొర్రన్న తన ద్విచక్ర మోటారు వాహనాన్ని నిలిపి ఛాయ్ తాగుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సోమ నవీన్ రెడ్డి వచ్చి బొర్రన్న బైక్ పై అగ్గిపుల్ల గీసి వేశాడు. ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. బొర్రన్న బైక్ మీద అగ్గిపుల్ల గీసి ఎందుకు వేశావు అని లింగన్న నవీన్ రెడ్డి ని అడిగి, ఊరిలో ఎవరితో మంచిగా ఉండవు అందరితో గొడవ పడతావు అంటు మందలించాడు. ఇద్దరు నన్ను ప్రశ్నిస్తారా అంటు ఆగ్రహాంతో ఊగి పోయిన నవీన్ రెడ్డి తన ఇంటిలోకి వెల్లి గొడ్డలి, పసుపు తవ్వే ఇనుప కొంకి తీసుకుని వచ్చి లింగన్న వీపులో చాలాసార్లు పొడిచాడు, కొంకి తో కూడా పొడిచి తీవ్ర గాయాల పాలు చేశాడు. ఇది చూస్తున్న బొర్రన్న బయపడి అక్కడి నుండి పారిపోయాడు. లింగన్న ను బంధువులు అంబులెన్సు లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స పొందుతూ ఆయన మధ్యాహ్నం మూడున్నర గంటలకు మృతి చెందాడు అనే నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు కోర్టు నిర్దారించింది. హత్య చేసినందుకు జీవితఖైదు తో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించారు జరిమానా చెల్లించని యెడల మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు. షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తి అని తెలిసి నేరానికి పాల్పడినందుకు గాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలపై అత్యాచారాల నిరోధక చట్టంలోని సెక్షన్ ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు పదిహేను వందల రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి సుగాలి నారాయణ తమ తీర్పులో వ్రాశారు.పోలీసుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.