కామారెడ్డి క్రైం, బతుకమ్మ : అప్పుల బాధతో కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీకి చెందిన కొండా పవన్(42) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు కథనం ప్రకారం.. రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటకు చెందిన పవన్ కుమార్ రెండేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చి స్థిరపడ్డాడు. కామారెడ్డి లో వెల్డింగ్ పని చేసుకునంటూ జీవిస్తున్నాడు. అదే క్రమంలో ఒక ఇల్లు కొని దానిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడు. తెలిసిన వారి వద్ద కూడా కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీలు చెల్లించలేక మనసులో మదనపడేవాడు. అదేక్రమంలో గురువారం పవన్ కుమార్ భార్య లావణ్య ఉదయం రెడ్డిపేట డ్వాక్రా గ్రూపులో డబ్బులు కట్టడానికి వెళ్లింది. ఇంటి వద్ద ఒక్కడే ఉన్న పవన్ కుమార్ తన ఇంటిలోని బెడ్ రూం సీలింగ్ ఫ్యానుకు చీరతో ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన లావణ్య, ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు, ఇతరులకు తెలియజేసింది. ఆ తర్వాత ఇంటి కోసం చేసిన అప్పులు తీర్చలేక జీవితంపై విరిక్తి చెంది, ఉరివేసుకొని చనిపోయినట్లుగా కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.