- ఉమ్మడి జిల్లాలోయథేచ్ఛగా కృత్రిమ కల్లు తయారీ
- నార్కోటిక్ శాఖను తప్పుదోవపట్టిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం
- ప్రతి కల్లుబట్టీలో పేదలు సేవిస్తోంది కల్తీ కల్లే..
- ఎక్సైజ్, పోలీసులకు ప్రతి సొసైటీ నుంచి మామూళ్లు..?
నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి జిల్లాలో రోజుకు లక్షల లీటర్ల కల్తీ కల్లు తయారీ అవుతున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు.. ప్రజలకు అవగాహన కల్పించే, వారిని అప్రమత్తం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు జిల్లాలో తాటి, ఈత చెట్ల లెక్కే లేకపోగా, సొసైటీలు, లైసెన్సులు, డిపోల నిర్వహణ హడావుడి అంతా ఇంతా కాదు.
- కల్తీ కల్లుకు కేరాఫ్ ఉమ్మడి జిల్లా..
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురి కావడం ఆస్పత్రుల పాలవుతున్నా అధికార యంత్రాంగాలు చేష్టలుడిగి చూస్తున్నాయి. పొలిటికల్ ఒత్తిళ్ల కారణంగా ఎక్సైజ్, పోలీసు శాఖలు కల్తీ (కృత్రిమ) కల్లు తయారీని కుటిర పరిశ్రమ నుంచి మినీ ఫ్యాక్టరీలుగా అప్ గ్రేడ్ కావడానికి సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. అయితే జిల్లా అధికార యంత్రాంగాలు ఏకంగా నార్కోటిక్ డిపార్ట్ మెం ట్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, వారికి పోలీసు, ఎక్సైజ్ శాఖలు సహకారం ఉండటంతో కొత్త చర్చ మొదలైంది. కృత్రిమ కల్లు తయారీని అడ్డుకోరు కానీ కల్తీ కల్లు తాగొద్దని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తారా? హవ్వా.. నవ్విపోదురు గాక మాకేటి అన్నచందంగా తయారైంది ఉమ్మడి జిల్లాలో అధికార యంత్రాంగం తీరు.
- లైసెన్సులు పోగుచేసి
కేవలం గీత వృత్తి పై ఆధారపడిన వారి సంక్షేమ కోసం ఏర్పడిన సొసైటీలు( డిపో) ల్లో కల్తీ కల్లు (రసాయినాలు, నిషేధిత మత్తు పదార్థాలతో) తయారు చేయడం మొదలు పెట్టారు. నిషేధిత మత్తు పదార్థాలను 10 గ్రాములు వాడితే రూ.లక్ష విలువైన కల్లు తయారవుతుండడంతో ఉమ్మడి జిల్లాలో కొత్త డిపోలు పుట్టుకువచ్చాయి. గీత వృత్తి కలిగిన కార్మికుల లైసెన్స్ లను పోగు చేసి సొసైటీలు (డిపో)లు ఏర్పాటు చేయడం కల్తీ కల్లు తయారు చేయడం మామూలు విషయంగా మారిపోయింది. ఒకప్పుడు డైజోఫాం, క్లోరోఫామ్ ను మాత్రమే వినియోగించి కల్లు తయారు చేయగా, ఇప్పుడు అత్యంత ఖరీదైన డేంజర్ డ్రగ్ గా పేరొందిన అల్ఫ్రాజోలంతోపాటు యాంటి సైకోటిక్ డ్రగ్ వినియోగిస్తూ కల్లు తయారు చేస్తున్నారు. కల్తీ కల్లు తయారీ ప్రక్రియ ఫ్యాక్టరీలను తలపిస్తోంది. నిజామాబాద్ నగరం, కామారెడ్డి పట్టణం, బోధన్, ఆర్మూర్, నందిపేట్ , ఎల్లారెడ్డి, బాన్సువాడ వంటి ప్రాంతాల్లోనే నిత్యం లక్షల లీటర్ల కల్తీ కల్లు ఉత్పత్తి అవుతోంది. పాల ప్యాకెట్ల మాదిరిగా డిపోలలో ప్యాకెట్లలో కల్లు అమ్మకాలు సాగుతున్నా ఇప్పటి వరకు అది కల్తీ లేదా కృత్రిమ కల్లు గా నిర్థారించలేదు.
- దొరికేది సూత్రధారులే.. పాత్రధారులను పక్కకు తప్పిస్తున్నది ఎవరు..?
ఉమ్మడి జిల్లాలో క్లోరోఫామ్, డైజోఫామ్ వంటి నిషేధిత మత్తుపదార్థాలతో కల్లు తయారీ చేస్తున్న వ్యాపారులు ఇప్పుడు ఏకంగా కల్లు తయారీలో ప్రయోగాలు చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవల కామారెడ్డి జిల్లా దుర్కిలో కల్తీ కల్లు సేవించి పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. అయితే వారికి చికిత్స అందించిన డాక్టర్లు కల్లు తయారీలో యాంటీ సైకోటిక్ డ్రగ్స్ వాడి ఉంటారని, లేదా కొత్త రసాయనాలు ఏవైనా కలిపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఎక్సైజ్ అధికారులు డిపోల్లో ఎక్కడా దాడులు చేసింది కానీ, నిషేధిత మత్తు పదార్థాలను కానీ స్వాధీనం చేసుకున్నది కానీ లేదు. దొరికేది స్మగ్లర్లు మాత్రమే. అయితే పట్టుబడిన నిషేధిత మత్తు పదార్థాలను ఏ డిపోలో వాడేందుకు తీసుకెళ్తున్నారనేదానిని మాత్రం ఎక్సైజ్ శాఖ లేదా పోలీసుశాఖ స్పష్టం చేసింది లేదు. ప్రతినెలా ఆయా శాఖల్లోని కొంత మంది అధికారులకు ఠంచన్ గా మామూళ్లు అందడమే దీనికి ప్రధాన కారణమని పలువురు ఆరోపిస్తున్నారు.
- లేని చెట్ల నుంచి కల్లు..
తాటి, ఈత చెట్లే కనిపించని ప్రాంతాల్లో పేదలు సేవించే కల్లును నిషేధిత మత్తు పదార్థాలు, కొత్త కొత్త రసాయనాలతో తయారు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో కల్లు మండువాల స్థానంలో కల్లుబట్టీలు ఏర్పాటు చేసి విక్రయాలు జరుగుతుంటే అక్కడ ఒక్క గీత కార్మికుడు కనిపించడు. అంతే కాకుండా లైసెన్స్ కలిగిన కార్మికుడు చెట్టెక్కి కల్లు గీస్తున్నట్లు కనిపించదు. అసలు లేని చెట్ల నుంచి కల్లు ఉత్పత్తి అవుతోందని దానినే సీసాలలో, ప్యాకెట్లలో నింపి విక్రయిస్తున్నామని డిపోల నిర్వహకులు చెప్పేదాన్ని పోలీసు, ఆబ్కారి శాఖలు ఓకే చేస్తున్నాయి. దీంతో కృత్రిమ కల్లును అధికారిక ముద్రతో అమ్ముతున్నారు. ప్రశ్నించే వారిపై భౌతిక దాడులు, కేసులు షరామామూలు విషయాలుగా మారిపోయాయి.
- ఖాకీలకు కొదవ లేదు..
ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ శాఖకు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి, అసిస్టెంట్ కమిషనర్ లు ఉన్నారు. ఇద్ధరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, పది ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఎక్సైజ్ ఎన్ఫో ర్స్ మెంట్ తో పాటు టాస్క్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. ఇక ఒక పోలీస్ కమిషనర్, ఒక జిల్లా ఎస్పీ, ప్రతి మండలానికి పోలీస్ స్టేషన్, టాస్క్ ఫోర్స్, సీసీఎస్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ వంటి నిఘా విభాగాలు ఉన్నా కృత్రిమ కల్లు తయారీకి అడ్డుకట్ట పడటం లేదు. ప్రతి ఏరియాలో కల్లు డిపోలు ఉన్నా వాటికి కల్లు సరఫరా జరుగుతున్నట్టు చెబుతున్న సొసైటీల్లో గీత వృత్తి కలిగిన కార్మికులు ఎందరు పనిచేస్తున్నారు, ఎన్ని ఈత, తాటి( రేషన్ ) చెట్ల నుంచి కల్లు వస్తుందనే లెక్కలు లేవు.