Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 February 2025, 2:14 pm Posted by : ramakrishna

హాస్టళ్లకు పాతబియ్యం సరఫరా చేయాలి

. సివిల్ సప్లయీస్ డీఎంకు కలెక్టర్ ఆదేశాలు

. రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ

బోధన్, బతుకమ్మ: ప్రభుత్వ హాస్టళ్లకు పాత బియ్యం సరఫరా చేయాలని సివిల్ సప్లయీస్ డీఎం  ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. రెంజల్ బాలికల మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూములను పరిశీలించి సదుపాయాలను గమనించారు. బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. పాఠశాలలో 418 మంది విద్యార్థినులు ఉన్నారని, పాఠశాలకు కొత్త బియ్యం సరఫరా కావడంతో అన్నం మెత్తగా అవుతోందని ప్రిన్సిపాల్ అర్షియా నజమ్ కలెక్టర్ కు తెలుపగా, ఆయన వెంటనే సివిల్ సప్లయీస్ డీఎంతో ఫోన్ లో మాట్లాడారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల పరిశీలన

నిజామాబాద్ – కరీంనగర్ – ఆదిలాబాద్ – మెదక్ ఉమ్మడి జిల్లాలతో కూడిన శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో రెంజల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ స్టేషన్ లో అందుబాటులో ఉన్న వసతులను తనిఖీ చేశారు. ర్యాంప్, టాయిలెట్స్, విద్యుత్ సరఫరా, నీటి వసతులను పరిశీలించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా పోలింగ్ ప్రక్రియ జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు వేర్వేరుగా  పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు – మన బడి కింద ఇటీవలే నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రావణ్ కుమార్, స్థానిక అధికారులు ఉన్నారు.


Old rice should be supplied to the hostels