Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 6:52 pm Posted by : ramakrishna

నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు

 

. . . కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

జాతీయ ఆహార నూనెల మిషన్ – ఆయిల్ పామ్ పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆయా మండలాలలో రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. దీంతో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారని అన్నారు. ఇప్పటికే 134.50 ఎకరాలలో 6725 ఆయిల్ పామ్ మొక్కలను నాటడం పూర్తయ్యిందని వివరించారు. 2027 మార్చి నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయిల్ పామ్ వల్ల సమకూరే లాభాలను గుర్తించి, అనేక మంది ఔత్సాహిక రైతులు ఈ పంట సాగుకు స్వచ్చందంగా ముందుకు వస్తూ డీ.డీలు చెల్లిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా జిల్లాలో 6500 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగులో ఉందని, అదనంగా ఈ ఏడాది 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు కోసం సరిపడా రెండు లక్షల ఆయిల్ పామ్ మొక్కలను నర్సరీలో సిద్ధంగా ఉంచామని కలెక్టర్ తెలిపారు. సంప్రదాయ వరి పంటతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు వల్ల అధిక లాభాలు సమకూరుతాయని, వరికి ఇది మంచి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు గాను ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తోందని, జిల్లా రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తామని అన్నారు.