Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 June 2026, 9:26 pm Posted by : ramakrishna

అధికారి ధన దాహం .. చిరుద్యోగి బలి

 

. . . పహాని రికార్డు అధికారి సంచిలో  ?

 

. . . సీసీ పుటేజి మాయం

 

. . . విచారణ జరిపితే అసలు సూత్రదారులు బయటికి

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

చేసింది ఒకరైతే శిక్ష మరొకరికి జరిగిందనే చర్చ రెవిన్యూ ఉద్యోగులలో జరుగుతోంది. అధికారి చేసిన ధన దాహానికి చిరు ఉద్యోగి బలయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ప్రధాన రోడ్డు పక్కనున్న విలువైన భూమికి సంబందించిన పహాని లో పేరు మార్పు… ఆ శాఖలో పెద్ద దుమారం రేపుతోంది. జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ శివారులో గల సర్వే నెంబర్ 291/ఏ,  291/ఏఏ, 292 భూమిలో పేరు మార్పు విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్ళింది. దీంతో ఉన్నతాధికారితో విచారణను చేసిన అనంతరం నిజామాబాద్ నార్త్ కార్యాలయానికి చెందిన చిరు ఉద్యోగిని సస్పెండ్ చేసారు. ఆ ఉద్యోగి అనధికార ఒప్పందంతో గత మూడు నెలలుగా విధులకు హాజరు కావడం లేదని తెలిసింది. సిసి పుటేజిలు మాయం అయినట్లు సమాచారం. కార్యాలయంలో ఉండాల్సిన పహానీ రికార్డులు అధికారుల సంచులలో  ఉంటాయని తెలిసింది. పహానిలో పేర్లు మార్పు జరిగినప్పుడు రికార్డు ఎవరి వద్ద ఉందనేది కీలకమైన అంశం. దీనికి తోడుగా కార్యాలయంలో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తి పనులు చక్కబెట్టిన విషయం అందులోని సిబ్బందికి తెలిసినప్పటికీ మౌనంగా ఉండిపోయారు. దీనిపై లోతుగా విచారణ జరిపితే గాని అసలు దోషులు బయటపడే అవకాశాలు లేకపోలేదు.

. . . సిసి పుటేజి మాయం

గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా మారింది నిజామాబాద్ నార్త్ కార్యాలయ పరిస్థితి. తహసిల్దార్ కార్యాలయంలో నిర్విరామంగా పని చేస్తున్న సిసి టివి లో నిక్షిప్తమైన పుటేజి మాయం వెనుక ఆంతర్యం బోధపడడం లేదు. విలువైన రికార్డు లు ఉన్న ప్రదేశంలో సిసి లు పని చేసినా.. అందులోని పుటేజి లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రికార్డులను బయటకు తీసుకెళ్లడం కోసమే పుటేజి లోని సమాచారాన్ని వెనువెంటనే తొలగించారనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

. . . పహానీలు బయటకు

గతంలో కార్యాలయంలోనే పహాని రికార్డులు భద్రంగా ఉండేవి. గత మూడు నెలలుగా రికార్డులు తరచుగా బయటకు వెళ్తున్నాయని సిబ్బంది చర్చించుకోవడం వినిపించింది.

. . . మూడు నెలలుగా

రికార్డు గదిని పర్యవేక్షించే ఉద్యోగి గత మూడు నెలలుగా విధులకు హాజరు కాలేదని సమాచారం. ఈ సమయంలోనే భూ తతంగం నడిచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనధికార ఒప్పంద సెలవులో ఉన్న ఆ ఉద్యోగి స్థానంలో మరొకరిని (కార్యాలయ అధికారి అనునాంగుడు) ఉంచి, జీతాలు ఇప్పించినట్లు తెలిసింది. నిజామాబాద్ నార్త్ కార్యాలయంలో జరిగిన సంఘటనపై లోతుగా విచారిస్తే అసలు సూత్రదారులు బయటకు వస్తారని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.