Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 5:49 pm Posted by : ramakrishna

సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యపరుస్తున్న అధికారులు

 

. . . తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాస్ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

సమాచార హక్కు చట్టం అమలులో క్షేత్ర స్థాయి అధికారులు సరైన విధంగా స్పందించడం లేదని, చట్టం పట్ల అవగాహన లేని కారణంగా కూడా ఇలాంటి పరిస్థితి వస్తోందని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ పీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం పెన్షనర్స్ భవనం లో నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన పౌర సమాజ వేదిక లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని అనేక అంశాలు ప్రస్తావించారు. శాఖ లోని సమాచార అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజల  చేతిలో ఆయుధంగానున్న ఈ పాసుపతాస్త్రం నిర్వీర్యమై పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాము పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పదివేలకు పైగా కేసులు పరిష్కరించామని, అధికారులకు అవగాహన కలిగించి పొరపాట్లు చేయొద్దని ప్రజలు అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని తీర్పులిచ్చినట్టు ఆయన తెలిపారు. కొన్ని కేసుల్లో 30 వేల రూపాయలు అత్యధికంగా జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ వయస్సును కూడా లెక్క చేయకుండా సమాచార హక్కు చట్టాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలకి అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. మరొక సమాచార కమిషనర్ దేశినేని భూపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్టిఐ కార్యకర్తగా మారాలని సమాజంలో ఉన్నటువంటి అవినీతి, అక్రమాలను, అరికట్టేందుకు ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ఆయనన్నారు. ఆర్టిఐను క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ తో పాటుగా అందరికీ అవగాహన కలిగించేందుకే జిల్లాలలో పర్యటిస్తున్నామని, అధికారులతో మాట్లాడటంతో పాటుగా సమాజ హితం కోరే పౌరులతో కూడా చర్చించాలని భావించి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొంటున్నమని వారు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న అనేకమంది అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. నిజామాబాద్ నగర అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం శ్రీనివాస్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, గెజిటెడ్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి అమృత రావు, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శిర్ప హనుమాన్లు, ఈవిల్ నారాయణ, ప్రముఖ న్యాయవాదులు బాస రాజేశ్వర్, వినోద్, సాంబశివరావు, ప్రసాద్ రావు,  పురుషోత్తం, రాధా కిషన్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం సమాచార కమిషనర్లకు వివిధ సంఘాల వారు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.