Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 November 2024, 4:40 pm Posted by : ramakrishna

అధికారిక దోపిడీ ?

. పైకి వద్దని చెప్పడం.. క్షేత్ర స్థాయిలో తరుగు తీయడం

 . కాంటా సమయంలోనే కోతలు

. ఖాళీ సంచి బరువు 600 గ్రాములు

. మరో కిలో తరుగు ఎందుకో..?

నిజామాబాద్, బతుకమ్మ :  ధాన్యం కాంటా  సమయంలో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు చేస్తున్న హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. ధాన్యం శుభ్రంగా లేదు, గోనె సంచి బరువు అంటూ ఇలా రకరకాల కారణాలు చెబుతూ క్షేత్రస్థాయిలో కిలోన్నర నుంచి రెండు కిలోల వరకు తరుగు తీస్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో ఈ అధికారిక దోపిడీ ఏమిటని రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులు చెబుతున్నాధాన్యం కాంటా చేసేటప్పుడు మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటోంది. సొసైటీల ఆధ్వర్యంలో  బహిరంగంగానే తరుగు పేరుతో ధాన్యం దోచుకుంటున్నారు. 40 కిలోల సంచిని కాంటాలో వేసి అదనంగా కిలోన్నర నుంచి రెండు కిలోల ధాన్యాన్ని జోడించి తూకం వేస్తున్నారు. 40 కిలోలు రైతు ఖాతాకు వెళ్తే మిగతావి సొసైటీ ఖాతాకు వెళ్తుండొచ్చని రైతులు అనుమానిస్తున్నారు.

ఖాళీ సంచి బరువు..

ధాన్యం కొలుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి  ఎక్కడ కూడా ఖాళీ సంచి బరువుపై ప్రస్తావించలేదు. అలాగే ధాన్యం తూర్పార పట్టాలని చెప్పింది లేదు. ధాన్యంలో తేమ  శాతం 17 ఉంటే చాలు.. కల్లాల వద్దనే సొసైటీ వాళ్లు కొనుగోలు చేస్తారని ప్రభుత్వం, అధికారులు చెబుతూ వచ్చారు. దీనికి భిన్నంగా ఇప్పుడు ఖాళీ గొనె సంచి బరువు 600 గ్రాముల పేరుతో తరుగు తీస్తున్నారు. సంచి బరువు సరే.. కిలో ధాన్యం దేనికోసం తీస్తున్నారని అడిగితే.. ధాన్యాన్ని శుభ్రం చేయలేకపోవడం కారణంగానే తీస్తున్నామని సొసైటీ అధికారులు బహిరంగంగా చెబుతుండడం గమనార్హం.

ఎవరి కోసం కిలోన్నర

ధాన్నయం కొనుగోళ్లు ప్రారంభమైన నాటి నుంచి తరుగు మాట వినిపించొద్దు, రైతులకు అన్యాయం చేయొద్దని ప్రజా ప్రతినిధులు స్పష్టమైన ఆదేశాలను అధికారులకు జారీ చేశారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో సొసైటీ వాళ్లు కిలోన్నర అదనంగా తూకం వేయడాన్ని చేయడం వారి పంపకాల కోసమే అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిల్లుల తిరకాసు కారణంగా మొదట్లో కొనుగోళ్లు ఆలస్యమైన సందర్భంలో ప్రైవేట్ వాళ్లు ధాన్యాన్ని తీసుకున్నారు. వారు ఎలాంటి తరుగు లేకుండానే కల్లాల దగ్గర పచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ప్రైవేట్ వాళ్లకు లేని శుభ్రత, సొసైటీ వాళ్లకు రావడమేంటని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు.