. . . కానిస్టేబుళ్ల నుంచి కమిషనరేట్ వరకు వాటాలు ఇవ్వాల్సిందే
. . . కృత్రిమ కల్లు ఫ్యాక్టరీల ముస్తేదారుల లక్షల్లో వసూళ్లు
. . . మద్యం సిండికేట్ వైన్స్ ల నుంచి ప్రతి నెల మామూళ్లు
. . . మామ్లాల నుంచి వచ్చిన మామూళ్లతో ఎక్సైజ్ భవనాల నిర్మాణం
నిజామాబాద్, బతుకమ్మ:
నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కోమ్మూరి మల్లారెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులను అర్జించారని ఏసీబీ దాడులు చేయడం కలకలం రేపుతుంది. రాష్ట్రంలో ఏసీబీ అవినీతిలో తిమింగలాలను ఏరివేసేందుకు ఎంచుకున్న సాధనం అసెట్స్( ఆధాయానికి మించిన ఆస్తులు) కేసులలో దాడులు చేస్తూ దడ పుట్టిస్తుంది. రాష్ట్రంలో ఈ నెలలో ఇద్ధరు తిమింగల స్థాయి అధికారుల వద్ధ అవినీతి నిరోధక శాఖ దాడులు చేసి వారి వద్ధ గుర్తించిన ఆస్తులు సూమారు రూ.400 కోట్లు అంటే అందరు అశ్చర్యపోయారు. ప్రభుత్వ శాఖలలో ఇతర ప్రాంతాలలో పనిచేయడం ఒక విధంగా ఉంటే ఉమ్మడి ఇందూర్ జిల్లా లో ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తే మామూళ్లకు అధికారికంగా గుర్తింపు ఉందని చెప్పాలి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలలో ఓ లెక్క. ఉమ్మడి నిజామాబాద్ లో అబ్కారి డ్యూటీ ఒక లెక్క అని చెబుతారు. చెక్ పోస్టులో కానిస్టేబుల్ ఉద్యోగానికైనా లేదా ఎస్ హెచ్ఓ పోస్టులకు… ఇతర అధికారుల పోస్టులకు కమీషనర్ స్థాయిలో పైరవీలు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాను మద్యం మాఫీయా కంటే కల్లు మాఫీయానే ఏలుతుందని చెప్పాలి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గా గత ఆరు సంవత్సరాలుగా పని చేస్తున్న మల్లారెడ్డి ఇటీవల మెడ్చల్ మల్కాజీగిరి జిల్లాలో 10 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఎసిబి నజర్ లో పడ్డారు. ఆయనకు సంబంధించిన ఇంటిలో బంధువుల ఇంటివద్ధ దాడులను నిర్వహించి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.3 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ప్రకటించిన వాటి విలువ బహిరంగా మార్కేట్ లో ఎన్నోరెట్లు ఎక్కువ అని ఎసిబి అధికారులు తెల్చారు.
మల్లారెడ్డికి ముందు ఉమ్మడి జిల్లాకు ఈఎస్ గా పనిచేసిన నర్సింహరెడ్డి, జ్యోతి కిరణ్ లతో పాటు నిజామాబాద్ నుంచి బదిలీ ఐనా డిప్యూటి కమీషనర్ శివరామాశాస్త్రీలు ఆదాయానికి మించిన ఆస్తులు కుడబెట్టారని ఎసిబి దాడిలో పట్టుబడిన వారే. కామారెడ్డి జిల్లా లో ఇటివల బిచ్కుంధ సిఐ సత్యనారాయణ ఎసిబికి రూ.2 లక్షల లంచం తీసుకుంటు పట్టుబడ్డారు. కామారెడ్డి ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రమేష్ అనే కానిస్టేబుల్ డేంజర్ డ్రగ్ గా పేరుగాంచిన అల్ప్రోజోలం దందాలో ఉన్నారని టిజీ న్యాబ్ కు చిక్కి కటకటాల పాలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో 142 మద్యం దుకాణాలు ఉన్నాయి. సుమారు వెయ్యి వరకు బెల్టు షాప్ లు ఉన్నాయి. దాబాలకు, సిట్టింగ్ లకు కొదవే లేదు. మద్యం దుకాణాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మిన, అమ్మకపోయినా పట్టించుకోరు. ఇక బెల్టు షాప్ లో దుకాణాదారుడు చెప్పిందే రేటు. ఒకటే కండిషన్ మీద ఎక్సైజ్ శాఖ బెల్టు షాప్ ల వైపు కన్నెత్తి చూడలేదు. మద్యం సేల్ పెంచాలని కమిషనరేట్ కు ఆదేశాలున్నాయని అటు వైపు కేసులు గట్రా ఏమి లేవు. కేవలం లైసెన్స్ డ్ కలిగిన మద్యం దుకాణంకు సంబంధించిన పరిధిలో బెల్టు షాప్ లలో సంబంధిత మద్యం కొనుగోలు చేయాలని నిబంధన ఒక్కటే ఆబ్కారి శాఖ, పోలీసు శాఖ అమలు చేస్తోందని చెప్పాలి. ఈ కారణంగా మద్యం దుకాణాల నుంచి ఎక్సైజ్ శాఖాధికారులకు ఒక్కో దుకాణం నుంచి వేల రూపాయల మామూళ్ళు దర్జాగా అందుతున్నాయి. ఇక కల్లు డిపోల నుంచి అధికారికంగానే లక్షల రూపాయలు మామూళ్ళు వస్తున్నాయి. కల్లు మామ్లా నిర్వాహకులైన ముస్తేదార్లు సొసైటీగా ఏర్పడి చేసుకున్నా డిపోలో ఎలాంటి మత్తుపదార్థాలు, నిషేదిత వస్తువులను కలిపి విక్రయిస్తున్న ఎక్సైజ్ అధికారులు కళ్లుమూసుకుంటారు. ఎందుకంటే ప్రతీనెల ఠంచన్ గా డబ్బులు వచ్చేది సొసైటీల నుంచి, డిపోల నుంచే. దానితో మద్యం దుకాణాలు, కల్లు దందాల నిర్వాహకుల దోస్తానాతో ఎక్సైజ్ అధికారులకు ప్రతీనెల మామూళ్ళ పంట పండుతుంది.

నిజామాబాద్ జిల్లాలో జరిగే మామూళ్ళ వ్యవహరం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో మొదలుకుని కమిషనర్ వరకు తెలుసు అనే నానుడి ఉంది. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఎక్సైజ్ శాఖలో ఉద్యోగులే తమ టీఏ, డీఏలతో పాటు ఒక్క రోజు వేతనంతో నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో, డీటీఎఫ్, ఆర్మూర్, భీంగల్ ఎస్ హెచ్ వో కార్యాలయాలను ప్రభుత్వం నుంచి, కనీసం ఎక్సైజ్ శాఖ నుంచి రూపాయి తీసుకోకుండానే నిర్మించారంటే అతిశయోక్తి కాదు. అయితే నిజామాబాద్ జిల్లాలో కల్లుముస్తేదార్లు, మద్యం సిండికేట్ వ్యాపారులు ఇచ్చిన గుడ్ విల్లతోనే భవనాలు నిర్మించారనే ఆరోపణలు లేకపోలేదు. క్విడ్ ప్రో అనే పద్దతిలో పరస్పర సహకారంతో పని చేయడం ఎక్సైజ్ శాఖ నుంచి చూసి నేర్చుకోవాల్సిందే. అందులో పని చేసే కానిస్టేబుల్ మొదలుకుని అధికారి వరకు వాటాలు దక్కాల్సిందే. లేకపోతే అధికారులపై అవినీతి ఆరోపణలు, అభియోగాలనేవి ఇక్కడ నిత్యకృత్యం. గతంలో పని చేసిన అధికారులను పొమ్మనకుండానే పొగబెట్టిన ఉదంతాలు అందుకు సాక్ష్యమని చెప్పాలి. గతేడాది వరకు ఎక్సైజ్ శాఖలో ఐక్యత రాగం ఉండగా ఈ యేడాది ఆరంభంలో జరిగిన ఉదంతంతో కానిస్టేబుళ్ళ బదిలీ వ్యవహరం ఎక్సైజ్ శాఖలో మామూళ్ళ పంచాయితీని రోడ్డున పడేసింది. వారు పకడ్బందీగా ఇచ్చిన సమాచారంతోనే ఈఎస్ మల్లారెడ్డికి ఏసీబీ అధికారులు స్పాట్ పెట్టారనే చర్చ జరుగుతుంది.
