Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:08 pm Posted by : ramakrishna

ఆఫీసర్లూ. . .  మీరూ ఫైను కట్టాల్సిందే

 

. . . అధికారులు జనాల బాధలు పట్టించుకోవడం లేదు

 

. . . సిద్దిపేట కలెక్టర్ హైమావతి

 

. . . ప్రజావాణి కాస్తా.. ఆఫీసర్ల పాలిట ‘పెనాల్టీ’ వాణి !

 

సిద్దిపేట, బతుకమ్మ :

 

సోమవారం రాగానే కలెక్టరేట్లల్ల ప్రజావాణి కౌంటర్ల ముందు జనాల తండ్లాట మామూలుగా ఉండదు. ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా పని కాక, ఆఖరుకు కలెక్టరమ్మకు చెప్పుకుందామని ఆశగా వస్తరు. కానీ, ఆ అర్జీలు కాస్తా కింది స్థాయి ఆఫీసర్ల టేబుళ్ల మీదకు చేరి, ఏసీ గాలికి పండుకుని మంచిగా నిద్రపోతుంటయ్. అధికారుల బద్ధకం చూసి చూసి విసిగిపోయిన కలెక్టర్ హైమావతికి గట్టిగా కోపం వచ్చింది. ప్రజావాణి అర్జీల పెండింగ్ మీద కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆఫీసర్లతో పెట్టిన మీటింగ్‌లో ఆమె చేసిన హెచ్చరికలు ఇప్పుడు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నయ్. జనం ఇచ్చే కాగితాలను వారం రోజుల్లో పరిష్కరించాలని చెప్పిన కలెక్టర్, ముప్పై రోజుల డెడ్‌లైన్ పెట్టి ఒక కొత్త లొల్లికి తెరలేపారు. ఒక్కో పెండింగ్ అర్జీకి ఏకంగా వెయ్యి రూపాయల ఫైన్ వేస్తానని కలెక్టర్ హైమావతి వార్నింగ్ ఇచ్చారు. అంటే, ఒక ఆఫీసర్ దగ్గర వంద అర్జీలు నెల రోజులు పెండింగ్ ఉంటే.. లక్ష రూపాయలు ఫైన్ కట్టాలన్నమాట. ఫైన్ల భయం పెట్టి పనులు చేయించడం కాగితాల మీద బాగానే ఉంటది. కానీ, క్షేత్రస్థాయిలో ఈ రూల్ పాస్ అయితే, ప్రజలకు న్యాయం జరగడం కంటే, దరఖాస్తుల పరిష్కారం పేరిట ఎలక్ట్రానిక్ రికార్డులను క్లియర్ చేసే ‘ఫేక్ పరిష్కారాల’ ట్రెండ్ పెరిగే ప్రమాదం ఉంది. 30 రోజులు దాటుతుందనే రందితో, అసలు సమస్యను పరిష్కరించకుండానే కింది స్థాయి సిబ్బంది అర్జీలను ఆన్‌లైన్‌లో క్లోజ్ చేసే అవకాశాలు ఎక్కువ. లేదంటే ఏదో కారణం చెప్పి రిజెక్ట్ చేసే అవకాశాలూ లేకపోలేదు. కాబట్టి జనాలు జర పైలం! మీ అర్జీల మీద ఫైన్ల వసూళ్లు జరుగుతున్నాయో, లేక మీ సమస్యలు గాలికి ఎగిరిపోతున్నాయో ఎప్పటికప్పుడు మీరే క్రాస్ చెక్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఆఫీసర్ల ‘వెయ్యి రూపాయల’ ఫైన్ భయానికి మీ దరఖాస్తులు డస్ట్ బిన్ పాలు కావడం ఖాయం !