. శాఖలో వెల్లువెత్తుతున్న విమర్శలు
. మంత్రి బంధువు కావడమే అర్హతనా..?
నిజామాబాద్, బతుకమ్మ: పాఠశాలల పనితీరు, విద్యా సంవత్సరం ఫలితాలు, సిబ్బంది పనితీరును మెరుగుపడే విధంగా చర్యలు చేపట్టేందుకు ఇవ్వాల్సిన ‘ఓడీ’ డిప్యుటేషన్ ఓ ఉపాధ్యాయురాలికి ఇస్తూ ఏకంగా పాఠశాల విద్య డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు జారీ కావడం జిల్లా విద్యాశాఖలో చర్చనీయాంశమైంది.
నగరంలోని మారుతినగర్ లో నివాసం ఉండే ఉపాధ్యాయురాలు బోర్గాం(పీ) పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తించారు. 2024 – 2025 విద్యా సంవత్సరానికి ఆమెను ముబారక్ నగర్ జెడ్పీహెచ్ ఎస్ కు డిప్యుటేషన్ పై పంపించారు. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగిసిన నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరానికి (2025-26) మళ్లీ డిప్యుటేషన్ ఇస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ సోమవారం రోజున ఉత్తర్వులు జారీ అయ్యాయి.
వెంటనే ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించారు. అయితే సదరు ఉపాధ్యాయురాలు ప్రభుత్వంలో కీలక మంత్రి బంధువు కావడమే డిప్యుటేషన్ కు అర్హతనా? అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంత వరకు న్యాయమని అంటున్నారు.