- మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ
ఎల్లారెడ్డి, బతుకమ్మ: ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సులకు ఘనంగా సన్మానించి, నర్సింగ్ ఒక వృత్తి కాదు – అది సేవా మానవత్వానికి నిలువెత్తు రూపం అని మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుకుల సత్యనారాయణ అన్నారు. ప్రతి సంవత్సరం మే 12న జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా, ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవా తత్త్వాలను స్మరించుకుంటూ, ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ మాట్లాడుతూ – “నర్సింగ్ ఒక వృత్తి కాదు – అది సేవా మానవత్వానికి నిలువెత్తు రూపం. ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రేరణతో నర్సులు ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారు” అని అన్నారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, కోవిడ్ వంటి సంక్షోభకాలంలో రోగులకు అహర్నిశలు సేవలందించిన ఆసుపత్రి నర్సులకు ఘనంగా సన్మానం నిర్వహించారు. సభా కార్యక్రమంలో నర్సులకు శాలువా కప్పి, స్మృతిచ్ఛాయ పత్రాలు అందించారు. అనంతరం కోవ్వొత్తులు వెలిగించి ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను స్మరించుకున్నారు. నర్సుల సేవలను గౌరవిస్తూ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి వారందరితో కలిసి ఉత్సాహంగా జరుపుకున్నారు. “ఈ సందర్భంగా ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ చరవాణిలో మాట్లాడుతూ ముందుగా నర్సులకు అందరికీ అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, “ఆరోగ్య రక్షణలో ముందుండే నర్సుల సేవలకు ప్రభుత్వం తరపున మరింత గుర్తింపు, ప్రోత్సాహం అందింలా చేస్తామన్నారు.” ఈ సందర్భంగా పలువురు నర్సులు తమ అనుభవాలను పంచుకున్నారు. రోగుల పట్ల తమ మమకారభావన, బాధ్యతలను వివరించారు. ప్రజలు నర్సుల సేవను గౌరవించాలి, ఆదరించాలి అనే సందేశంతో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రవీంద్ర మోహన్, ఎండి ఫ్యూమిగేషన్ వెంకట భద్రయ్య, ఐసీటీసీ కౌన్సిలర్ గోపాల్, తిమ్మారెడ్డి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వెల్లుట్ల గ్రామ మాజీ సర్పంచ్ గంట సాయిలు, సొసైటీ డైరెక్టర్ సుఖేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి మండల యూత్ ఉపాధ్యక్షులు కిరణ్ తేజ, వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిజ్జన మహేందర్, ఉపాధ్యక్షులు మక్కల మహేష్, ముజీబ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి, నాగం శంకరయ్య, నీల రవి, ఆసుపత్రి సిబ్బంది, నర్సులు పాల్గొన్నారు.
