Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:11 pm Posted by : ramakrishna

38 కి పెరిగిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య

 

. . . వేగవంతమైన న్యాయం లక్ష్యంగా కేంద్రం నిర్ణయం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38 కి పెంచే బిల్లుకు ఆమోదం లభించింది. న్యాయ వ్యవస్థపై పెరుగుతున్న భారం తగ్గించి, కక్షిదారులకు త్వరితగతిన న్యాయం అందించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దాదాపు లక్ష పెండింగ్ కేసులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది. ఒక ఏడాదిలో సుమారు 65 వేల కేసులను పరిష్కరిస్తున్నప్పటికీ, అదే సమయంలో దాదాపు 75 వేల కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.

. . . న్యాయ వ్యవస్థ బలోపేతానికి రూ.7 వేల కోట్లు

సత్వర న్యాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం న్యాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సుమారు రూ.7 వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. న్యాయమూర్తుల సంఖ్య పెంపుతో అదనపు భారం ఏర్పడినా, కక్షిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం 2019 లో ఒకసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచిందని, ప్రస్తుతం మరోసారి పెంచుతూ ప్రజలకు వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకుంటోందని పేర్కొంది.

. . . కొలీజియం వ్యవస్థపై చర్చ

న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా జాతీయ న్యాయ నియామక కమిషన్ (ఎన్జెఎసి) తీసుకురావడానికి గతంలో ప్రయత్నం జరిగినా, దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజల అభిప్రాయంగా భావిస్తున్నామని, వాటిని స్వాగతిస్తున్నామని కేంద్రం తెలిపింది. ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా భవిష్యత్తులో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకత అవసరమని, అందుకోసం జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం మంచిదనే అభిప్రాయాన్ని కేంద్రం వ్యక్తం చేసింది.

. . . ఈ 20 పై త్వరలో స్పష్టత

ఈ 20 ఇంధనం విషయంలో ఉన్న అపోహలను తొలగించేందుకు త్వరలో స్పష్టత ఇస్తామని కేంద్రం తెలిపింది. ఈ 20 వల్ల ప్రయోజనాలు ఉన్నాయని, నష్టాలపై వస్తున్న అనుమానాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తామని పేర్కొంది. యూఏఈకి చెందిన ఓ కంపెనీతో కలిసి భారత్‌లో త్వరలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి ఈ 20 పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తామని కేంద్రం వెల్లడించింది.