. . . గంటల్లోనే ఆలయ చోరీ కేసు ఛేదన
కామారెడ్డి, బతుకమ్మ :
జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆపరేషన్ కవచ్ మరోసారి తన ప్రభావాన్ని చాటుకుంది. సదాశివనగర్ మండలంలోని రేణుక మాత ఎల్లమ్మ దేవాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించి ఇద్దరు అంతర్‌జిల్లా ఘరానా దొంగలను అరెస్టు చేశారు. ఈ నెల 20వ తేదీ అర్థరాత్రి సదాశివనగర్ గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయంలోకి గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి ప్రవేశించారు. అమ్మవారి వెండి కండ్లు, చీర, హుండీతో పాటు అందులోని నగదును అపహరించారు. దేవాలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. చోరీ అనంతరం తెల్లవారుతుండటంతో పోలీసులకు చిక్కిపోతామనే భయంతో నిందితులు చోరీ చేసిన సొత్తు, హుండీ, వెండి కండ్లు, ఉపయోగించిన హీరో ప్యాషన్ ప్రో బైక్‌ను సమీపంలోని పొదల్లో దాచిపెట్టి పరారయ్యారు. అయితే ఈరోజు తెల్లవారుజామున దాచిన వస్తువులను తిరిగి తీసుకెళ్లేందుకు వచ్చిన సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. పద్మాజీవాడ ఎక్స్ రోడ్ వద్ద ఆపరేషన్ కవచ్‌లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అనుమానించి తనిఖీ చేయగా, వారి వద్ద దేవాలయ హుండీ, వెండి కండ్లు లభించాయి. విచారణలో గుడిలో చోరీ చేసింది తామేనని వారు అంగీకరించారు. అరెస్టైన నిందితులను ఉప్పల నాగరాజు, తవటం సంతోష్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఆస్తి సంబంధిత నేరాల్లో ఆరితేరిన పాత నేరస్తులని పోలీసులు తెలిపారు. గతంలో నిజామాబాద్, మెట్‌పల్లి, కథలాపూర్, ధర్మపురి, జగిత్యాల, కొడిమ్యాల్, వర్ని, కోరుట్ల, వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు చోరీలకు పాల్పడి జైలుశిక్ష అనుభవించినప్పటికీ, మళ్లీ నేరాలకు పాల్పడినట్లు వెల్లడైంది. నిందితుల నుంచి ఎల్లమ్మ అమ్మవారి వెండి కండ్లు, చీర, హుండీలోని రూ.400 నగదు, అలాగే చోరీకి ఉపయోగించిన హీరో ప్యాషన్ ప్రో మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలోనే శాస్త్రీయ ఆధారాలతో కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సదాశివనగర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు సీఐ బి. సంతోష్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ కవచ్ ద్వారా జిల్లాలో నేర నియంత్రణ మరింత సమర్థవంతంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.