. . . కేసీఆర్ కుటుంబంపై అక్రమ కేసులతో రేవంత్ పైశాచిక ఆనందం
. . . కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ నిప్పుల గుండమే
. . . బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఆర్మూర్, బతుకమ్మ :
సీఎం రేవంత్ రెడ్డి విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెరతీశారని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగాగానే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు రావాలని నోటీసుల మీద నోటీసులు జారీ చేయిస్తూ శాడిజాన్ని ప్రదర్శిస్తున్న రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని చేత కాని దద్దమ్మ కాంగ్రెస్ అని ఆయన దుయ్యబట్టారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మల్లించేందుకు రేవంత్ డైవర్షన్ పొలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇందులో భాగంగానే తల తోక లేని ఫోన్ ట్యాపింగ్ కేసు అని ఆయన విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో లబ్దిపొందేందుకు కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు సిట్ పేరుతో నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. విచారణకు సహకరిస్తానని, సిట్ బృందం ఎర్రవల్లి లోని తన ఫార్మ్ హౌస్ కి వచ్చి విచారించాలని కేసీఆర్ అభ్యర్దించినా పరిగణనలోకి తీసుకోకుండా హైదరాబాద్ లోనే విచారణకు రావాలని మళ్లీ నోటీసులు జారీ చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ అని ఆయన గుర్తుచేశారు. కేసీఆర్ దేశాన్నే కదిలించిన గొప్ప ఉద్యమ నేత, తెలంగాణ జాతిపిత అని కొనియాడారు. తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన కేసీఆర్ దేశం గర్వపడే గొప్ప ముందుచూపున్న లీడర్ అని జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఇలాంటి గొప్పనేతకు సిట్ నోటీసులు ఏంటని మండిపడ్డారు. అబద్ధాల పునాదులపై ఫేక్ హమీలతో ప్రజను మభ్యపెట్టి రేవంత్ రెడ్డి దొడ్డిదారిన అధికారంలోకి వచ్చారన్నారు. ఏ రెండేళ్లలోనే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మల్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్ష సాధింపు రాజకీయానికి నిదర్శనమని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఇది విచారణ కాదు, ఇది ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న రేవంత్ రెడ్డి రాక్షస రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన తెలిపారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రిజనరీ అని, తన దార్శనిక పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టిన కేసీఆర్ ఒక విజనరీ అని వ్యాఖ్యానించారు. తాను జైలు పాలయ్యాను కాబట్టి కేసీఆర్ ను కూడా జైలులో పెట్టాలన్న దుష్ట తలంపుతో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని విష రాజకీయాలు చేసినా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచి గొప్ప నేతగా విలసిల్లుతున్న కేసీఆర్ నీడను కూడా తాకలేరని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరిపేయలేరని ఆయనన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంలా మారి ఆ నిప్పుల సెగకు కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుందన్నారు. గతంలో కేసీఆర్ తో గోక్కున్నోళ్లు ఎవరూ బాగుపడలేదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్ పై, ఆయన కుటుంబంపై పగ పెంచుకొని రాక్షస పాలనతో పైశాచిక ఆనందం పొందుతున్న రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర చివరి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా హీనమైన చరిత్ర మూటగట్టుకోవడం ఖాయమన్నారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.