- చర్చల ప్రసక్తే లేదు.. తుపాకీ వీడాల్సిందే
- నక్సల్స్ లొంగిపోవాల్సిందే.. .వైఖరి మార్చుకోవాల్సిందే
- కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్, బతుకమ్మ : ‘‘మావోయిస్టులతో మాటల్లేవు… మాట్లాడుకోవడాల్లేవ్.. నిషేధిత సంస్థతో చర్చల ప్రసక్తే లేదు… వాళ్లు తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వాళ్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందే.’’అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మావోయిస్టు సమస్యను సామాజిక కోణంతో చూడాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆపరేషన్ కగార్ ను ఆపాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ‘‘తుపాకులు చేతపట్టి అమాయక ప్రజలను, గిరిజనులను కాల్చి చంపడాన్ని సామాజిక కోణంతో చూడాలనడం ఏం పద్దతి. బాంబులు (క్లైమోర్ మైన్స్) అమర్చి పోలీసులను తునాతునలు చేసి చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలా? అసలు మావోయిస్టులపై నిషేధం విధించిందే కాంగ్రెస్ పాలకులు కదా? ఇప్పుడు సామాజిక కోణం, చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కడమేంది? ఎంతో మంది ప్రజలను, గిరిజనులను, పోలీసులను కాల్చి చంపినప్పుడు మీకు ఈ విషయం గుర్తుకు రాలేదా?’’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మావోయిస్టులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో ఈరోజు ఉదయం హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు ‘ఆపరేషన్ కగార్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విడ్డూరం. నక్సల్స్ సమస్యను సామాజిక కోణంతో చూస్తున్నామని చెప్పడమేంది? ఇదెక్కడి పద్దతి? మావోయిస్టుల చేతిలో తుపాకులున్నాయి. గిరిజనులను, అమాయకులను కాల్చి చంపుతున్నారు. బాంబులు పెట్టి పోలీసులను చంపుతున్నారు. ఇంత జరుగుతుంటే సామాజిక కోణంతో చూడాలని చెప్పడమేంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే కదా మావోయిస్టులను నిషేధించింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కాంగ్రెస్ నాయకులే నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం వాళ్ల ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? ‘‘అసలు ఇక్కడ మావోయిస్టులపై నిషేధం ఉంది కదా? నిషేధం విధించింది ఇక్కడి పాలకులే కదా. మరి మావోయిస్టులపై నిషేదం తొలగించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? సమాధానం చెప్పాలి. నిషేధం తొలగించకుండా, తుపాకీతో పట్టుకుని అమాయకులను కాల్చి చంపుతున్నోళ్లతోని చర్చలేంది? గిరిజనుల చేతిలో తుపాకులుండవ్ కదా? వాళ్లు ఎవరినీ చంపరు. వాళ్లు మనుషులను చంపడానికి బాంబులు పెట్టరు. అవన్నీ చేసేది మావోయిస్టులే. ఆ నిషేధిత సంస్థతో ప్రభుత్వం ఎట్లా చర్చలు జరుపుతుంది? కేసీఆర్ ఎప్పుడో ఒకసారి బయటకు వస్తడు. మళ్లా కనబడడు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి పోటీ పడి నక్సల్స్ గురించి మాట్లాడుతున్నరు. మహాముత్తారంలో ఎస్ఐ భార్య శ్రీమంతం చేసుకునే సమయంలో బాంబులు పెట్టి నక్సల్స్ ఆ ఎస్ఐని చంపేశారు. అప్పుడే కానిస్టేబుల్ ను చంపేశారు. దూరదర్శన్ జర్నలిస్టును చంపేశారు. బీజేపీ నాయకులు సామ జగన్మోహన్ రెడ్డి, మధుసూదన్ గౌడ్, రామన్నగోపన్నలను చంపేశారు. అంతెందుకు మీ కాంగ్రెస్ నాయకులను ఎంతో మంది చంపేశారు. శ్రీపాదరావు వంటి అజాత శత్రువును కూడా నక్సల్స్ చంపేశారు. కేసీఆర్ టీడీపీలో ఉండగా ఆ పార్టీ నాయకులను ఎంతోమందిని చంపేశారు. అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు. బాంబులు అమర్చి పోలీసులను తునాతునకలు చేసి నక్సల్స్ చంపుతుంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ సమర్ధిస్తారా?… గిరిజనులను, అమాయక ప్రజలను ఇన్ ఫార్మర్ల పేరుతో కాల్చి చంపుతుంటే సమర్దిస్తారా? సమాధానం చెప్పాలి. మేం మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదు. తుపాకీ వీడాల్సిందే. పోలీసులకు లొంగిపోవాల్సిందే. వారి వైఖరి మారాల్సిందే. వాళ్లతో చర్చలు జరిపే సందర్భమే రాదు. పాకిస్తాన్ పౌరులను తిరిగి పంపే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దేశమంతా ఈ విషయంపై సీరియస్ గా చర్చలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం సరికాదు. ఇప్పటికీ చాలా మంది పాస్ పోర్టు, వీసాల్లేకుండా ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారముంది. రోహింగ్యాలు చాలా మంది ఇక్కడే నివసిస్తున్నారు. రోహింగ్యాలపై వైఖరిని తెలియజేయాలి. దీనిని శాంతిభద్రతల సమస్యగా చూడాలే తప్ప మతం కోణంతో, రాజకీయ లబ్ది కోణంతో చూస్తే హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డాగా మారే ప్రమాదముందనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చి వారం రోజులైంది. నిన్నటిదాకా ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని బుకాయిస్తూ వచ్చారు. మరి నివేదిక వచ్చి వారం దాటింది. చర్యలెందుకు తీసుకోవడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ప్రజలను మభ్యపెట్టడానికి డ్రామాలాడుతున్నయ్. అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ కాపాడుతోంది. 6 గ్యారంటీల వైఫల్యాలపై మాట్లాడకుండా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కాపాడుతోంది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతూ ప్రజా సమస్యలను, 6 గ్యారంటీలను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర కులగణన నిర్ణయం చారిత్రాత్మకం. కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరం. ఎందుకంటే కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణను పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. 52 శాతం జనాభా ఉన్న బీసీలను 46 శాతంగా చూపారు. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలు చేస్తున్నామని చెప్పి…అందులో నుండి 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయించారు. నిజానికి కాంగ్రెస్ బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటోంది. అయినా ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. ఇక కాంగ్రెస్ చేసిందేముంది? బీసీల జనాభాను తగ్గించి చూపారు. అందుకే కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు’ అని అన్నారు.
