Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 6:45 pm Posted by : ramakrishna

జక్రాన్ పల్లి విమానాశ్రయ పనుల్లో ఎలాంటి పురోగతీ లేదు

  • రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కేంద్ర ప్రభుత్వానికి కమిటీ రిపోర్ట్

 

 నిజామాబాద్, బతుకమ్మ:  నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాలవాంచ ఐన జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకు , పది అడుగులు వెనక్కు అన్న చందంగా మారింది.  తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 150 కిలో మీటర్ల దూరంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన విషయం విధితమే. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ జరిపితే ఏర్పాటుకు కేంద్రం అంగీకరించడం తో గతంలో పరిశీలన జరిపింది. తెలంగాణ రాష్ట్రంలోని జక్రాన్ పల్లి, ఆదిలాబాద్ బసంత్ నగర్ లో ఎయిర్పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో పున:సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దానికనుగుణంగా కేంద్ర వైమానిక శాఖ ఎన్. శ్రీనివాసరావు, మల్లికా జయరాజ్, శైలేష్ దఖానే లతో కూడిన బృందాన్ని కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏప్రిల్ 23 నుండి 25 వరకు క్షేత్రస్థాయిలో విమానాశ్రయాల సందర్శన నిర్వహించింది.

తాజాగా ఈ కమిటీ రిపోర్ట్ ప్రకారం విమానాశ్రయ స్థలంలో మసీదు, నీటి వనరులు, విద్యుత్ స్తంభాలు, కొన్ని నివాస ప్రాంతాలు , కొండ శిఖర వ్యాసార్థంలో అడ్డంకులు ఉన్నాయని, వీటిని మునుపటి టెక్నో ఎకనామిక్ ఎజబిలిటీ రిపోర్టులో కూడా ప్రస్తావించామని అందులో పేర్కొన్నట్లుగా భారత వైమానిక దళ స్థలం భూసేకరణ ,భౌతిక అడ్డంకులకు సంబంధించిన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని నివేదిక అందజేసింది. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అడ్డంకులు లేని భూమిని ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కమిటీ చెప్పింది.  దీంతో జక్రాన్ పల్లి విమానాశ్రయ ఏర్పాటుకు  ఒకవైపు ఎంపీ అర్వింద్ నిత్యం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని కలిసి జక్రాన్ పల్లిలో విమానాశ్రయ ఏర్పాటుకు మార్గం సుగమమయ్యేలా చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం పంపాల్సిన రిపోర్టులను పంపకుండా, అనువైన భూములను ఎంపిక చేసి ఇవ్వకుండా తాత్సారం చేయడం పట్ల ప్రజలు విమర్శిస్తున్నారు.