Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 June 2025, 6:31 pm Posted by : ramakrishna

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో  ఒక్కరూ బ్రతకలేరు

242 మంది మృతి

మృతుల్లో గుజరాత్ మాజీసీఎం విజయ్ రూపానీ

అహ్మదాబాద్‌, బతుకమ్మ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం మధ్యాహ్నం లండన్ బయలుదేరిన ఫ్లయిట్ నంబర్ ఏఐ-171 విమానం కొద్దినిమిషాలకే కూలిపోయింది.  ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉండగా అందరూ ప్రయాణికులు మృతి చెందినట్లు అహ్మదాబాద్ సీపీ జ్ఞానేంద్ర సింగ్ ఓ ప్రకటన చేశారు. ఈప్రమాదం నుంచి ఒక్కరూ కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఇందులో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బంది 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా దేశస్థుడు ఉన్నారు. మృతుల్లో 217 మంది పెద్దవారు, 11 మంది పిల్లలు, ఇద్దరు పసివాళ్లు.. 169 మంది భారతీయులు మృతి చెందారు.  ప్రమాద తీవ్రతతో ప్రయాణికులు మాంసపు ముద్దలుగా మారారు. ఘటన స్థలి తెగిపడిన శరీర భాగాలు, గుర్తు పట్టలేనంత కాలిన దేహాలతో భీతాహహంగా ఉంది. మృతులను డీఎన్ఏ టెస్టు ద్వారా గుర్తించి బంధువులకు అప్పగిస్తామని గుజరాత్ హెల్త్ సెక్రటరీ ద్వివేదీ తెలిపారు. ఈప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ దుర్మరణం చెందాడు. కాగా ప్రమాద స్థలం వద్ద సహాయక చర్య లు కొనసాగుతున్నాయి.

బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిన విమానం

అహ్మదాబాద్‌లోని  బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై విమానం కూలింది. రెండు హాస్టల్‌ భవనాలను విమానం ఢీకొట్టింది. విమానం మొదటగా జూనియర్ డాక్టర్ల హాస్టల్‌ను ఢీకొట్టి, తర్వాత సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ హాస్టల్‌ను ఢీకొట్టింది.  ఈప్రమాదంలో పలువురు మెడికోలు మృతి చెందారు.

తిరిగి ప్రారంభమైన రాకపోకలు

అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. పరిమిత సంఖ్యలో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. విమాన ప్రమాదంతో మూడు గంటల పాటు విమానాశ్రయ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

No one survives Ahmedabad plane crash