నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో బిజినెస్ టీచర్లు స్కూల్ ముఖం చూడకుండా తమ సొంత వ్యాపారాల్లో మునిగి తేలడంతో 2018-19 లో అప్పటి కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆర్డీవో విచారణ జరిపి నివేదిక అందజేసినప్పటికీ దాదాపు ఏడు సంవత్సరాలు పూర్తవుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పాఠశాల ముఖం చూడని వాళ్ళు చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, చిట్టీలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు చివరికి మద్యం దుకాణాల్లో భాగస్వాములుగా అనేక మంది ఉపాధ్యాయులు ఉన్నారు. లీడర్ల ముసుగులో ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులు చేయని దందా లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతల పంచన చేరి దందాలు నడిపించుకుంటూ కేవలం రిజిస్టర్ లో సంతకం చేయడం, వేతనాలు తీసుకోవడం కోసమే స్కూల్ మెట్లు ఎక్కుతున్నారు. మరికొందరు వారి స్థానాల్లో విద్య వలంటీర్లను లేదా ప్రైవేట్ టీచర్లను పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం దర్జాగా చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2018-19 సంవత్సరంలో బిజినెస్ టీచర్ల వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో విజిలెన్స్ విచారణ చేపట్టి నివేదిక అందజేశారు. ఆ లెక్కల ప్రకారం అప్పట్లో 110 మంది ఉపాధ్యాయులు స్కూలు మొఖం చూడకుండానే ఆయా దందాలు లో మునిగి తేలుతున్నారని నివేదిక సమర్పించారు. ఏసీబీ అధికారులు వీరిపై దృష్టి పెట్టి 2018 -19 లో కలెక్టర్ ఆదేశాలు మేరకు ఆర్డీవో జరిపిన నివేదిక ప్రకారం బిజినెస్ టీచర్ల ఆస్తుల వివరాలు పై ఆరా తీయాలని పలువురు కోరుతున్నారు.