. . . నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు భారీ ఊరట
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 120 నుంచి 150 కు పెంచేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ సోమవారం లెటర్ ఆఫ్ పర్మిషన్ జారీ చేసింది. అదనంగా 30 ఎంబీబీఎస్ సీట్ల మంజూరు కోసం జూన్ 17, 2026 న ఎన్‌ఎంసీకి చెందిన నలుగురు అసెస్సర్ల బృందం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలతో పాటు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహించింది. కళాశాలలో అందుబాటులో ఉన్న అధ్యాపక సిబ్బంది, మౌలిక వసతులు, బోధనా సదుపాయాలు, ఆస్పత్రి సేవలు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించింది. ఆ తనిఖీ నివేదిక ఆధారంగా ఎన్‌ఎంసీ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అదనంగా 30 సీట్లను మంజూరు చేస్తూ మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 150కు పెంచేందుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. కృష్ణ మోహన్ మాట్లాడుతూ, ఎన్‌ఎంసీ అనుమతితో జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మరిన్ని వైద్య విద్య అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కళాశాల అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.