నిజామాబాద్, బతుకమ్మ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ (అలహాబాద్) ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ కు చెందిన విద్యార్థి రాహుల్ చైతన్య ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్ చైతన్య(20) వినికిడిలోపంతో బాధపడుతున్నాడని, ఆ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని ఏసీపీ అజేంద్ర యాదవ్ తెలిపారు.
మూగ, చెవిటి విభాగంలో ఐఐఐటీలో చేరిన రాహుల్ గత మూడు నెలలుగా తరగతులకు హాజరు కాలేదని, ఒత్తిడి, నిరాశతో బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. తన పుట్టిన రోజుకి ముందు రోజే శనివారం(మార్చి 29) రాత్రి హాస్టల్ బిల్డింగ్ ఐదో అంతస్తు పై నుంచి దూకాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన తల్లితో రాహుల్ వీడియో కాల్ మాట్లాడినట్లు తెలిసింది.
అంతకు ముందు రోజు మరో విద్యార్థికి గుండెపోటు
రాహుల్ చైతన్య ఆత్మహత్య చేసుకున్న ముందు రోజే (మార్చి 28న) అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో కట్రావత్ అఖిల్ అనే విద్యార్థి గుండెపోటుతో మణించాడని విద్యా సంస్థ పీఆర్వో పంకజ్ మిశ్రా తెలిపారు.
రాహుల్ అనారోగ్య కారణాలతో బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు. ఇద్దరు విద్యార్థుల మరణాలపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.