. . . రాష్ట్రం, నిజామాబాద్ రూరల్ ప్రజలు సుభిక్షంగా ఉండాలని మొక్కులు
. . . ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రూరల్ ఎమ్మెల్యే
నిజామాబాద్ రూరల్ / మేడారం, బతుకమ్మ :
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి, ఆయన సతీమణి వినోదినితో కలిసి కుటుంబ సమేతంగా సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకున్నారు. అనంతరం తులా భారంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిలువెత్తు బంగారంని సమ్మక్క సారాలమ్మలకు సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అలాగే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలు పాడిపంటలతో, మంచి వర్షాలతో సుఖసంతోషాలతో జీవించాలని దేవతలకు ప్రత్యేకంగా మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ సమ్మక్క–సారలమ్మలు తెలంగాణ గిరిజన సంస్కృతికి ప్రతీకలని, మేడారం జాతర రాష్ట్ర ఆధ్యాత్మిక విశిష్టతను దేశవ్యాప్తంగా చాటుతోందన్నారు. దేవతల ఆశీస్సులతో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని అన్నారు. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, మేడారం జాతర నిర్వహణకు రహదారులు, రవాణా, వైద్య సదుపాయాలు, భద్రత వంటి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టిందని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ప్రజల ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకువస్తామని ఎమ్మెల్యే భూపతిరెడ్డి భరోసా ఇచ్చారు.
