నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోనే చారిత్రాత్మకమైన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ లో ఎన్నికల కోలాహలం మొదలైంది. క్లబ్ 2025 వార్షిక ఎన్నికల నిర్వహణకుగాను క్లబ్ సభ్యులు,సీనియర్ న్యాయవాది కిరణ్ కుమార్ గౌడ్ ప్రధాన ఎన్నికల అధికారిగా నియమితులు అయిన నేపథ్యంలో ఆయన తనకు సహాయకులుగా అసిస్టెంట్ ఎన్నికల అధికారులుగా బంటు వసంత్,ఉదయ కృష్ణ, ఎర్రం విగ్నేష్, దొన్పల్ సురేష్ లను నియమించుకుని ఎన్నిక విధివిధానాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసి,నామినేషన్లను స్వీకరించడం ప్రారంభించారు. ప్రభుత్వ అధికారికాయుతమైన నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ బైలా ప్రకారం జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా కొనసాగుతారు. ఉపాధ్యక్షులుగా పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా కలెక్టర్ లు ఉంటారు. మరో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుంది. కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు నామినేషన్లు స్వీకరించి ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో సోమవారం ఉపాధ్యక్ష పదవికి ప్రస్తుత ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందాన్ మరోసారి పోటీ చేయడానికి వీలుగా నామినేషన్ పత్రాలను ప్రధాన ఎన్నికల అధికారి కిరణ్ కుమార్ గౌడ్ కు అందజేశారు. కార్యదర్శి పదవికి భూపాల్ రెడ్డి, నర్సారెడ్డి, స్వామిదాస్ ,సంయుక్త కార్యదర్శి పదవికి డాకం సాయిలు,కోశాధికారిగా పదవికి కె. శరత్ కుమార్ నామినేషన్ పత్రాలను దాఖలు చేసినట్లు గౌడ్ తెలిపారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం ముగిసినందున 24 తేదీన నామినేషన్ పత్రాలను పరిశీలిస్తామని,25 తేదీన నామినేషన్ పత్రాలను ఉపసంహరణకు అవకాశం కల్పించి,అదే రోజు పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ప్రకటించి,29 న సాయంత్రం ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. పోలింగ్ అనంతరం ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తామని ఆయన చెప్పారు.