. . . అభినందించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
. . . గవర్నర్ చేతుల మీదుగా ట్రోఫీ బహూకరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
సాయుద దళాల పతాక దినోత్సవ విరాళాల సేకరణలో నిజామాబాద్ జిల్లా గడిచిన పదేళ్లలో ఏకంగా ఏడు సార్లు ముందంజలో నిలిచి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది సైనిక సంక్షేమ నిధికి అత్యధిక విరాళాలు సేకరించిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిజామాబాద్ జిల్లా ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్ కు ట్రోఫీ బహూకరించారు. శనివారం సాయంత్రం సైనిక సంక్షేమ అధికారి, ఇతర సిబ్బంది సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డిని కలువగా, కలెక్టర్ వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది మరింత పెద్ద మొత్తంలో సైనిక సంక్షేమ నిధికి విరాళాలు సేకరించాలని సూచించారు. గా, తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2015వ సంవత్సరం నుండి రాష్ట్రంలో సాయుద దళాల పతాక దినోత్సవ విరాళాలను అత్యధిక స్థాయిలో సేకరించిన జిల్లాకు ఏటేటా ట్రోఫీలు అందిస్తున్నారని ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి రవీందర్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల తోడ్పాటుతో నిజామాబాద్ జిల్లా వరుసగా 2015 నుండి 2019 వరకు ఐదేళ్ల పాటు విరాళాల సేకరణలో ముందంజలో నిలిచి, ట్రోఫీలు అందుకుందని తెలిపారు. అలాగే, 2023లో, తాజాగా ఈ ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచి పదేళ్లలో ఏడు పర్యాయాలు నిజామాబాద్ జిల్లా ట్రోఫీని దక్కించుకున్నదని తెలిపారు. విరాళాల సేకరణలో జిల్లాను ముందంజలో నిలిపేందుకు తోడ్పాటును అందించిన వారందరికీ సైనిక సంక్షేమ అధికారి రవీందర్ కృతజ్ఞతలు ప్రకటించారు.
