- అర్ధరాత్రి అగంతకుల దుశ్చర్య
- అసైన్డ్ భూముల కబ్జాదారులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మోపాల్ మండలం సిర్పూర్ లో దారుణం జరిగింది. ఏకంగా ప్రభుత్వ భూములను చెరబడుతున్న భూ మాఫియా ఆగడాలు మితిమిరిపోయాయి. దశాబ్ధ కాలంగా అసైన్డ్ భూములను కబ్జా చేసి అనుభవిస్తున్న భూ మాఫియా బరితెగించింది. మోపాల్ మండలం సిర్పూర్ గ్రామ శివారులోని 602 సర్వే నెంబర్ లో అవధూత నిర్మలానంద స్వామి ఏర్పాటు చేసుకున్న ఆశ్రమానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. సోమవారం అర్ధరాత్రి ఆగంతకులు నిప్పు పెట్టి తగలబెట్టడంతో మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగు చూసింది. విషయం తెలిసిన స్వామితో పాటు భక్తులు అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా భూమిపై కన్నేసి కబ్జా చేసిన వారే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోపాల్ పోలీస్ స్టేషన్ తో పాటు పోలీస్ కమిషనర్ కు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలో 602 సర్వే నంబర్ లో వందల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. దానికి తోడు పక్కనే ఉన్న అటవీ భూముల్లో ఉన్న మొరం మట్టిని తవ్వేందుకు గతంలో అనుమతులు తీసుకున్న వ్యక్తులు అక్కడ ఇతరులకు ఇచ్చిన భూములను చెరబట్టారు. 602లో మొరం తవ్విన మాఫియా అక్కడ మిగిలిన భూమిని కబ్జా చేసి సాగులోకి తెచ్చారు. అదే సమయంలో 602/110, 602/111 సర్వే నంబర్ లో ని అవధూత నిర్మలానంద స్వామికి ప్రభుత్వం కేటాయించిన భూమిని చెరబట్టారు. అందులో కౌలుదారులుగా ఉన్న వారిని వెళ్లగొట్టి ఆ భూమిని స్వాధీనంలోకి తీసుకుని అక్కడ అక్రమంగా కరెంట్ కనెక్షన్ తీసుకుని నిర్మాణాలు కూడా చేశారు.సంబంధిత భూమి స్వాధీనం కోసం అవధూత నిర్మలానందస్వామి అక్కడ కంచే ఏర్పాటు చేసేందుకు సిమెంట్ స్తంబాలను ఏర్పాటు చేశారు. అయితే కబ్జాదారులు రాత్రికి రాత్రే మాయం చేశారు. ఈ విషయంపై మోపాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తర్వాత కాలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి, జిల్లా కలెక్టర్ కు స్వయంగా నిర్మలానంద స్వామి తన భూమి కబ్జా విషయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత భూమిని ఇటీవల రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారుల సహాయంతో సర్వే చేయించి కబ్జాదారుల చెర నుంచి భూమిని స్వామిజికి భూమిని అప్పగించారు. దీంతో స్వామిజి తన భూమిలో చిన్నపాటి ఆశ్రమాన్ని నిర్మించి అక్కడ సత్సంగం నిర్వహిస్తున్నారు. ప్రతి గురువారం, పౌర్ణమి రోజుల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆశ్రమం కోసం అక్కడ సాగు కోసం కరెంట్ కనెక్షన్ కు దరఖాస్తు చేయడంతో గతంలో కబ్జా చేసిన వారే కరెంట్ కనెక్షన్లు ఇది వరకే పొందినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో స్థానికంగా అసైన్డ్ భూములు ఎవరికి కేటాయించారనే వివరాలు సేకరిస్తున్న సమయంలోనే వారే ఆశ్రమానికి నిప్పు పెట్టారన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసు శాఖకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నట్లు మోపాల్ ఎస్సై యాదగిరి తెలిపారు.