. . . జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలో కొత్తగా హెచ్ఐవీ సోకిన వారిని అతి త్వరగా గుర్తించి, వారికి చికిత్స అందించాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రాజశ్రీ అన్నారు. గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం ఆధ్వర్యంలో మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 0.32% ప్రివలెన్స్ ప్రకారం 5873 మందికి హెచ్ఐవీ సోకి ఉంటుందని అంచనా వేశారన్నారు. జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఇచ్చిన టార్గెట్ ప్రకారం వారిలో 95% మందికి అంటే 5580 మందికి హెచ్ఐవి స్థితి గురించి తెలిసి ఉండాలని సూచించారు. ప్రస్తుతం మన జిల్లాలో 5451 హెచ్ఐవి కేసులు నమోదులో ఉన్నాయని, మిగిలిన 136 కేసులను త్వరగా గుర్తించి, చికిత్స అందించాలన్నారు. దాని కోసం ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ పై అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలన్నారు. హై రిస్క్ ఉన్న ప్రదేశా లను గుర్తించి టీం వర్క్ గా పని చేసి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, మెడికల్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్, డిపిఎం సుధాకర్, సిఎస్ఓ నవీన్, సిపిఓ మొహిజ్ అహ్మద్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబ్బంది, టిబి నియంత్ర సిబ్బంది, స్వచ్ఛంద సంస్థ లు పాల్గొన్నారు.
