. . . విద్యారంగానికి కేవలం 8.2% మాత్రమే కేటాయించడం అన్యాయం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
ప్రభుత్వాలు మారినా విద్యారంగం పట్ల నిర్లక్ష్యం మాత్రం మారడం లేదని, ప్రతి ప్రభుత్వం విద్యకు మొండి చేయి చూపుతోందని ఏ.ఐ.పీ.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు బొడ అనిల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా బడ్జెట్‌లో మొత్తం రూ. 3,24,234 కోట్లు ఉండగా, విద్యారంగానికి కేవలం రూ. 26,674 కోట్లు మాత్రమే కేటాయించడం తీవ్ర నిరాశ కలిగించే విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన శాతం కేవలం 8.2% మాత్రమే ఉండటం, కొఠారి కమిషన్ సూచించిన 30% ప్రమాణంతో పోలిస్తే చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. కనీసం 20% అయినా కేటాయించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ తక్కువ బడ్జెట్ కారణంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే ప్రభుత్వ విద్యా రంగం కేజీ టు పీజీ వరకు విద్యార్థులు మౌలిక సదుపాయాల లోపంతో ఇబ్బందులు పడుతున్నారని, సంక్షేమ హాస్టల్స్ లో సరైన వసతి, ఆహారం లేకపోవడం, గురుకుల విద్యాసంస్థల్లో సిబ్బంది, సౌకర్యాల కొరత, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందకపోవడం, పాఠ్యపుస్తకాలు సమయానికి అందకపోవడం, యూనివర్సిటీల అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికలు లేకపోవడం లాంటి సమస్యలతో నిండిపోయిందని, ఈ పరిస్థితిలో ఇలాంటి తక్కువ బడ్జెట్ కేటాయింపులు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తాయని అన్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే వెంటనే విద్యారంగానికి కేటాయింపులు పెంచి, కనీసం 20% వరకు పెంచాలని, యూనివర్సిటీలు, గురుకులాలు, హాస్టల్స్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యా రంగంపై నిర్లక్ష్యం తెలంగాణ అభివృద్ధి పై నిర్లక్ష్యం చేసినట్టేనని, విద్యారంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వాలని ఏ.ఐ.పీ.ఎస్.యు తరఫున ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్ సింగ్ ఠాకూర్, సందీప్, శివ, తిరుపతి, సత్యం తదితరులు పాల్గొన్నారు.