Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 August 2025, 7:30 pm Posted by : ramakrishna

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్

  •  ప్రశంసించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి

 

నిజామాబాద్, బతుకమ్మ : ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావానికి లోనైన ప్రాంతాలలో ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు అందించిన సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అభినందించారు. జాతీయ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళాలు కనబరచిన తెగువ, కృషి కారణంగా జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణనష్టం వంటి సంఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగామని అన్నారు. వరదల వల్ల జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన ఆయా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విపత్తు ప్రతిస్పందన దళాలు సాహసోపేతమైన కృషిని కనబర్చాయని అన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు ఆధునిక పరికరాలతో రక్షణ చర్యలు చేపట్టాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్ల సహాయంతో పాటు ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విపత్తు ప్రతిస్పందన దళాలు ఎంతో గొప్పగా సేవలు అందించాయని అన్నారు.

 

ఎగువ ప్రాంతాల నుండి వరద పోటెత్తడంతో నిజామాబాద్ జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయని గుర్తు చేశారు. ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు తెగిపోయి వరద నీరు గ్రామాలలోకి వచ్చి చేరుతున్న క్రమంలో జిల్లా యంత్రాంగం తక్షణమే అప్రమత్తమై విపత్తు ప్రతిస్పందన దళాల సేవలను వినియోగించుకుందని కలెక్టర్ తెలిపారు. సమాచారం అందించిన వెంటనే విపత్తు ప్రతిస్పందన దళాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని తక్షణ సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయని అన్నారు. బోధన్ మండలం హంగర్గ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న సుమారు 480 మందిని ఎన్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు రెస్క్యూ చేశాయని అన్నారు. అదేవిధంగా రెంజల్ మండలం కందకుర్తి వద్ద సీతారాం త్యాగి మహారాజ్ ఆశ్రమంలో వరదలలో

NDRF and SDRF services are excellent

చిక్కుకున్న 8 మందిని విపత్తు సహాయక బృందాలు ప్రాణాలకు తెగించి కాపాడారని, ఆశ్రమంలోని మూగ జీవాలకు కూడా అవసరమైన మేత, నీటి వసతిని సమకూర్చారని కలెక్టర్ వివరించారు. సాలూర మండలంలోని మందర్న, హున్సా, ఖాజాపూర్ గ్రామాలలో జలదిగ్బంధంలో చిక్కుకున్న 120 మందిని బోట్ల ద్వారా ఎస్.డీ.ఆర్.ఎఫ్, 7వ పోలీస్ బెటాలియన్ బృందాలు రక్షించాయని తెలిపారు. సుమారు 12 అడుగుల ఎత్తుతో కొనసాగిన వరద ప్రవాహ ఉద్ధృతిని దాటుకుని ప్రజలను సురక్షిత ప్రదేశాలకు చేర్చారని అన్నారు. ముత్యాల చెరువు తెగడంతో దర్పల్లి మండలం వాడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టగా, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందం హుటాహుటిన చేరుకొని సహాయక చర్యలు కొనసాగించిందని తెలిపారు. ఇదే రీతిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వరదలలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేసేందుకు ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ బృందాలు సాహసోపేతమైన కృషిని కొనసాగించాయని కలెక్టర్ అభినందించారు.

NDRF and SDRF services are excellent