. . . డీఎంహెచ్‌ఓ డా. బి. రాజశ్రీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లాలో క్షయవ్యాధి (టీబీ) నిర్మూలన లక్ష్యంగా అమలు చేస్తున్న టీబీఎంబీఏ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి మండలం నుంచి ఐదుగురు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను నిక్షయ మిత్రలుగా నమోదు చేయాలని సూచించారు. శనివారం జిల్లా టీబీ సిబ్బందితో నిర్వహించిన ప్రత్యక్ష సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, టీబీ రోగుల సన్నిహితులకు టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన వ్యక్తులందరికీ తప్పనిసరిగా టీపీటీ అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. టీబీ నియంత్రణ కార్యక్రమాల పర్యవేక్షణ, సమన్వయం మరియు పురోగతిని మెరుగుపరిచేందుకు జిల్లాలోని ప్రతి మండలానికి ఒక క్లాస్-1 అధికారిని నియమించినట్లు డాక్టర్ రాజశ్రీ తెలిపారు. మండల స్థాయిలో టీబీ నిర్మూలన కార్యక్రమాలు సమర్థవంతంగా అమలయ్యేలా ఈ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. టీబీ నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు నిక్షయ మిత్రల పాత్ర కీలకమని ఆమె అన్నారు. యువతను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా టీబీ నియంత్రణ చర్యలకు మరింత బలం చేకూరుతుందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా క్షయవ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి, ఏవో సుశాంత్ కుమార్, టీబీ కోఆర్డినేటర్లు లక్ష్మణ్, రవి గౌడ్, నరేష్, డీహెచ్ఈ ఘన్‌పూర్ వెంకటేశ్వర్లు, అలాగే జిల్లా టీబీ నియంత్రణ సిబ్బంది పాల్గొన్నారు.
