Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 January 2026, 5:03 pm Posted by : ramakrishna

ఎల్లారెడ్డిలో ఘనంగా జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ

. . . ఓటే ఒక వజ్రాయుధంఅనే సందేశంతో ప్రజాస్వామ్య పండుగ

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఓటు మన హక్కు మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్యానికి రక్షణ కవచంఅని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించి, మంచి నాయకున్ని ఎన్నుకోవడం ద్వారా దేశ భవిష్యత్తును బలపరచాలని పిలుపునిచ్చారు. ఓటు వేయకపోతే భారత ప్రజాస్వామ్యంలో జీవించి కూడా ఒక మృతునితో సమానం అన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్లు, నూతన ఓటర్లు (యువత)ను సన్మానిస్తూ, ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని మరింత ఉత్సాహంగా నిర్వహించారు. యువత ముందుండి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, ప్రతి ఎన్నికలో ఓటు వేయడం ద్వారా హక్కులను సాధించుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని, భారత ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ, ఓటరు నమోదు, ఓటింగ్ శాతం పెంపు, యువతలో అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యమన్నారు. ఈ దినోత్సవం ద్వారా ఓటే ప్రజాస్వామ్యానికి ప్రాణం అనే భావనను బలపరుస్తూ, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించాలనే సంకల్పాన్ని దేశమంతటా పునరుద్ఘాటిస్తారు. ఈ ర్యాలీలో పార్థసింహారెడ్డి (రెవెన్యూ డివిజనల్ అధికారి), ప్రేమ్ కుమార్ (తహసీల్దార్), మహేష్ (మున్సిపల్ కమిషనర్), శ్రీనివాస్ (నాయక్ తహసీల్దార్), శ్రీనివాస్ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) తో పాటు రెవెన్యూ సిబ్బంది, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

National Voters Day rally held in Yella Reddy
National Voters Day rally held in Yella Reddy