నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కక్షలు, కార్పణ్యాలు,తగాదాలు, వివాదాలు లేకుండా ప్రజలందరు ఒకరి హక్కులను మరొకరు గౌరవిస్తూ గౌరవంగా జీవించాలనే లక్ష్యంతో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతున్నదని నిజామాబాద్ నాల్గవ అదనపు జ్యూడిషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్(జూనియర్ సివిల్ జడ్జి) వడ్డి హరి కుమార్ తెలిపారు.జాతీయ లోక్ అదాలత్ ను మార్చి 8 న నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లాకోర్టు ప్రాంగణంలోని కోర్టు హల్ లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ భూసారపు రాజేష్ గౌడ్, పోలీసు అధికారులు నిజామాబాద్ నార్త్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నిజామాబాద్ ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గంగాధర్,మాక్లూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, ఎక్సైజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మల్లేశ్ తదితరులు తో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.పౌరులందరు స్వేచ్ఛ జీవులేనని ఒకరి స్వేచ్ఛను హరించే నేరపూరిత చర్యను చట్టం అనుమతించబోదని అన్నారు.ఆస్థి తగాదాలు,వ్యక్తిగత కక్షలు,అనుకోని ,అనుకున్న పరిస్థితుల వలన కొందరు నేరాలకు పాల్పడటం జరిగిందని తెలుపుతూ రాజీ పడదగిన కేసులలో రాజీపద్దతిన కేసులను శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎలాంటి సివిల్ వివాదమైన ఇరుపక్షాలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని జడ్జి హరి కుమార్ తెలిపారు.ఎక్సైజ్ కేసులలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారు ,నేర తీవ్రతను బట్టి వారి నేరాంగీకారంతో జరిమానాలతో కేసులు క్లోజ్ చేయడం జరుగుతుందని ఆయన వివరించారు.సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో గల నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని లోక అదాలత్ లో వారి కేసులను రాజీపద్ధతిన పరిష్కరించుకునే విదంగా ప్రోత్సహించాలని హరి కుమార్ సూచించారు. జాతిజనుల మేలు కోసం నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయడానికి పౌర సమాజ సహకారం తీసుకోవాలని ఆయన అన్నారు. సమావేశంలో కోర్టు కానిస్టేబుల్స్ ఎం.ఎ. లతీఫ్,విషాన్ గౌడ్,బాలకృష్ణ, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.