Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 4:52 pm Posted by : ramakrishna

న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాది పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని సరస్వతి నగర్‌లో గల పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ గౌడ్ మాట్లాడుతూ, ఎందరో మహనీయుల ఉద్యమాలు, ప్రాణత్యాగాల ఫలితంగా బ్రిటిష్ వలస పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ సార్వభౌమత్వానికి సవాలుగా మారిన పాక్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు అభినందనీయమని అన్నారు. నేటి యువత దేశభక్తితో ముందుకు సాగుతూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిషత్ న్యాయవాదులు రాజ్‌కుమార్ సుబేదార్, పడిగేల వెంకటేశ్వర్, సి. సాయిరెడ్డి, నారాయణదాస్, సుదర్శన్ రెడ్డి, ఎర్రం విఘ్నేష్, జయసింహ, పూపాల విజయ్, పిండం రాజు, ఉదయ్ కృష్ణ, గోవర్ధన్, ప్రభాకర్, హనుమంత్ రెడ్డి, సింగం అంజలి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.