Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 5:03 pm Posted by : ramakrishna

జూలై 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలంగాణ ఆల్ పర్సనల్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ వెల్లడించింది. ఆదివారం నిజామాబాద్ లోని పెన్షనర్స్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దాదాపు 20 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారని తెలిపారు. పెన్షనర్ల సమస్యలు, సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాత పెన్షన్ విధానం (ఓల్డ్ పెన్షన్ స్కీమ్) అమలు, వేతన సంఘాల కాలపరిమితిని 12 సంవత్సరాల నుంచి తగ్గించే అంశంపై పునర్విమర్శ, రిటైర్డ్ ఉద్యోగులందరికీ నగదు రహిత వైద్య సేవలు అందించడం, రైల్వే ప్రయాణ రాయితీలను పునరుద్ధరించడం వంటి ప్రధాన డిమాండ్లపై సమావేశంలో తీర్మానాలు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ కె. రామ్మోహనరావు, జిల్లా అధ్యక్షుడు శిల్ప హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి నారాయణ, నిజామాబాద్ డివిజన్ అధ్యక్షుడు రాధాకిషన్, కార్యదర్శి సాంబశివరావు, పుష్పవల్లి, జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తమరావు, బట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.