Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 6:17 pm Posted by : ramakrishna

నగరంలో  నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన ర్యాలీ

 

. . . విద్యార్థులు గవర్నర్‌తో వర్చువల్ సమావేశం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 

 

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం నిజామాబాద్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు కొనసాగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ రాజా గౌడ్ లు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో విద్యార్థుల భాగస్వామ్యంతో గవర్నర్‌తో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందేశాన్ని అందించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ వ్యవస్థపై, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ,విద్యపై దృష్టి సారించి,ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ),జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సాయ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజశ్రీ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సౌందర్య, మండల విద్యాశాఖాధికారి సాయ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) అధ్యక్షుడు డా. విశాల్,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ జిల్లా శాఖ చైర్మన్ పోతంకర్ లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్ డా.శ్రీను నాయక్, కోశాధికారి కెంపుల నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్, కార్యవర్గ సభ్యులు డీకొండ యాదగిరి, మల్లెపుల జగన్మోహన్ గౌడ్,జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ చౌహాన్ బాలాజీ, మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు బుస్సా అంజనేయులు, కరీపె రవీందర్, కొండ సత్య ప్రసాద్, యెండల సుధాకర్, పద్మ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.