Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 7:17 pm Posted by : ramakrishna

ఐసీఎంఎస్ లో నర్సారెడ్డి నాటకాలు

  •  రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ.. రైతుల డబ్బులతో వేతనం
  • గత పాలకవర్గం సస్పెండ్ చేసినా.. మళ్లీ విధుల్లోకి వచ్చిన వైనం

 

నిజామాబాద్, బతుకమ్మ:

ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ అంటూ ఓ రాజకీయ పార్టీని పెట్టుకున్న గడ్డం నర్సారెడ్డి అక్కడితో ఆగకుండా ఐడీసీఎంఎస్ లో ఉద్యోగిగా చలామణి అవుతూ అటు రాజకీయ, ఇటు ఉద్యోగ నాటకాన్ని సమానంగా నడుపుతున్నారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఐడీసీఎంఎస్ లో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తూ రైతుల డబ్బులను జీతంగా తీసుకుంటున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జిల్లా రైతాంగానికి సేవలు సులభంగా అందించేందుకు సహకార సొసైటీలు (పీఏసీఎస్),డీసీసీబీ, ఐడీసీఎంఎస్ ( ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్) ఉన్నాయి. అయితే ఐడీసీఎంఎస్ లో ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఉద్యోగిగా చలామణి అవుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ పాలకవర్గం, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఐడీసీఎంస్ లో సుమారు 20 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఒక్కొక్కరికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు వేతనాలను సంస్థ చెల్లిస్తోంది. ఐడీసీఎంఎస్ ద్వారా సొసైటీలకు పంపిణీ చేసిన ఎరువులు, మందుల సంచులపై  వచ్చే ఒక్కో రూపాయి  పోగుచేసి ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వచ్చే కమీషన్ ను వేతనాలకు ఉపయోగిస్తున్నారు. ఇలా ఒక్కో రూపాయి జమ చేసి సిబ్బందికి వేతనాలు చెల్లించే ఐడీసీఎంఎస్ ఓ రాజకీయ పార్టీ నాయకుడికి వేతనం ఎందుకు ఇస్తుందో చెప్పాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రైతులు, ఉద్యోగుల ఫిర్యాదు మేరకు గడ్డం నర్సారెడ్డిని గత పాలకవర్గ చైర్మన్ సాంబారి మోహన్ పాలకవర్గం తీర్మానం చేయించి సస్పెండ్ చేశారు.

  •  అధికార పార్టీ అండతో మళ్ళీ విధుల్లోకి..

రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఉద్యోగానికి పనికి రాడని గతంలో పాలకవర్గం అతన్ని సస్పెండ్ చేసినా కొన్ని రోజులకే మళ్ళీ తిరిగి యథాస్థానంలో నర్సారెడ్డి విధుల్లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అధికార పార్టీ నాయకుల అండతో ఆయన తిరిగి ఎక్కడ విధుల నుంచి తప్పించారో అక్కడే తిరిగి డ్యూటీలో జాయిన్ కావడం విశేషం. గత పాలకవర్గ హయంలో అప్పటి అధికార పార్టీ ఎంపీకి కీలక అనుచరుడిగా చెప్పుకున్న వ్యక్తి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏకంగా తనకు కార్పొరేషన్ పదవి లేదా డైరెక్టర్ పోస్టు ఇవ్వాలని పైరవీలు చేయడం విశేషం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గొడుగు కింద ఉండే నాయకుడు ఉద్యోగిగా వేతనం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.

  • ఉద్యోగి కన్నా పార్టీ లీడర్ గానే చెలామణి..

ఐడీసీఎంఎస్ లో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న వ్యక్తి విధులకు రాకపోయినా అడిగే నాథుడే లేడు. ప్రధానంగా అక్కడ అధికారులు ఉన్నప్పటికీ తాత్కాలిక పొలిటికల్ లీడర్ దే హవా. ఎప్పుడు విధులకు వస్తాడో, ఎప్పుడు రాడో అనేది అధికారులే చెప్పలేని పరిస్థితి. పొలిటికల్ పార్టీల ద్వారా విధుల్లో చేరిన వ్యక్తి పొలిటికల్ లీడర్ కావడంతో అధికారులు కూడా ఏం చేయలేక తలలు పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయి సందర్శన చేస్తున్నట్లు చెప్పడం, ఇష్టమొచ్చినప్పుడు రావడం, వచ్చినప్పుడే రిజష్టర్ లో సంతకాలు చేయడం గమనార్హం. ఈ విషయంపై ఐడీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.నగేష్ ను బతుకమ్మ వివరణ కోరగా తమ వద్ద నర్సారెడ్డి అనే వ్యక్తి డ్యూటీలో ఉన్న విషయం వాస్తవమేనని కానీ ఆయన పొలిటికల్ పార్టీకి అధ్యక్షుడా కాదా అనేది తనకు తెలియదన్నారు. తనకు నిర్ణయాధికారం లేదని పాలకవర్గం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.

 

Narsa Reddy's plays at ICMS