Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 July 2025, 3:46 pm Posted by : ramakrishna

దేశ విచ్చిన్నమే నరేంద్రమోదీ ప్రధాన అజెండా

  • ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశ పౌరులంతా ఐక్యంగా ఉద్యమించాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్ అన్నారు. సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐవైఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం పి. రంజిత్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశాన్ని ఉద్దేశించి  అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు నేర్లకంటి శ్రీకాంత్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి, విచ్చిన్నం ద్వారా రాజ్య పాలన చేయాలని,భారతదేశంలో నివసించాలంటే ఆర్ఎస్ఎస్ అనుమతి అవసరం అనేలా నీచ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న మోడీ ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా దేశ పౌరులంతా సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానని బీజేపీ ఎన్నికల ముసాయిదాలో ప్రకటించారు, కానీ మోదీ మూడో సారి అధికారంలోకి వచ్చినా ఇప్పటికి ఆ హామీ అమలు కాలేదని, తాను చెప్పిన ఏటా 2 కోట్ల ప్రకారం ఇప్పటికి 12సంవత్సరాల కాలంలో 24కోట్ల ఉద్యోగాలు భర్తీ కావాలని, మోడీ మాటలన్నీ నీటి మూటలేనని వారు ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలవంతంగా దేశంలో మత ఉన్మాదం అనే కాషాయ విష బీజాలను విద్యార్థులు, యువత మెదలల్లో చొప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అందుకే ఈ మధ్య కాలంలో చరిత్రను వక్రీకరించి సినిమాలు తీస్తున్నారని, ఇవి సమాజానికి హానికరమని, దేశ ప్రజలు చరిత్ర ను అధ్యయనం చేయాలని అన్నారు.మోదీ అనేకసార్లు తనలా యువత తయారుకావాలని అంటున్నారు, కానీ మోదీలా మారాలంటే దేశ సమైక్యతను దెబ్బతీసే విధానాలను అనుసరించి మత ఉన్మాద రాజకీయాలను ప్రోత్సహించడమేనని, ఈ విధానాలను దేశ యువత అంగీకరించడానికి సిద్ధంగా లేరని వారు ఉద్ఘాటించారు. CPI జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ ఏఐవైఎఫ్ యువతను మంచి సమాజం వైపు సన్నద్ధం చేయడానికి కృషి చేస్తున్నదని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రజాస్వామ్యయుతంగా అమలు కొరకు పోరాటాలను ఉదృతం చేస్తుందన్నారు. ఈ సమావేశంను ఉద్దేశించి సిపిఐ నగర కార్యదర్శి వై ఓమయ్య, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బి. రఘురాం మాట్లాడారు. అనంతరం

  •  జిల్లా నూతన కమిటీ ఎన్నిక

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పి. రంజిత్, ఉపాధ్యక్షులు రమేష్ చారి, రఘురాం నాయక్, సాయికిరణ్, మధు యాదవ్, జిల్లా కార్యదర్శి సాయి తేజ, సహాయ కార్యదర్శులు కండ్లకోయ ప్రసాద్, రమేష్, కోశాధికారి నాగేష్, కార్యవర్గ సభ్యులుగా సంతోష్, రక్షిత్, కిరణ్, సునీల్, సాయిలు, ఆకాష్, రమేష్ లను ఎన్నుకోవడం జరిగింది.