Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2025, 11:33 pm Posted by : ramakrishna

పేరు ఇందిరమ్మది

  • ఇసుక అమ్మకాలు జోరుగా
  • అధిక ధరలపై ఇందిరమ్మ లబ్దిదారుల్లో ఆందోళన

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచాలని, ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తుంటే అది కాస్తా పక్కదారి పడుతుంది. ఉమ్మడి జిల్లాలో మంజిరా, గోదావరి నదుల తీరాలలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దానికి మైనింగ్ శాఖతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు సహకరిస్తుండడంతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ అక్కడ ఇసుక తవ్వకాలను చేస్తున్న లీడర్లు కాంట్రాక్టర్లు కావడంతో ఇందిరమ్మ ఇళ్ళకు బదులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని గోదావరి, మంజిరా నదులతో పాటు వాగులు, వంకలలో ఇసుక తవ్వకాలు రోజు సాగుతుంది. ప్రభుత్వ, ఇందిరమ్మ ఇళ్ళ కోసం వే బిల్లులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు అమ్మకాలు చేసుకుంటున్నారు. దానితో సామాన్యులకు ఇసుక దొరకని పరిస్థితి తలెత్తింది.

ఇందిరమ్మ ఇళ్ళకు ఉచితంగా అందజేయాల్సిన ఇసుకను టిప్పర్ల యజమానులు, ట్రాక్టర్ల యజమానులు ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని బాన్సువాడ, బీర్కూర్ రహదారిపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ట్రాక్టర్ ఇసుకను రూ.1600కు విక్రయించాల్సిన చోట రూ.2500 ధరకు విక్రయించడంపై గ్రామస్తులు కొల్లూర్ వద్ద రోడ్డుపై బైటాయించి ట్రాక్టర్లను అడ్డుకున్నారు. రైతులకు ఉచితంగా ఇసుకను అందజేస్తామని ప్రభుత్వం సరిపడ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించి అమలు చేస్తుంటే ఇసుక మాఫియా మాత్రం ఇసుకను సరిహద్దులను దాటిస్తోంది. బాన్సువాడ, బోధన్, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోని నదులు, వాగులు, వంకలలో ఇసుకను తరలిస్తున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉండడం దారుణం.

ఇసుక అక్రమ రవాణాపై పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదవుతున్న అవి జరిమానాకే పరిమితం అవుతున్నాయి. అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయడంపై అంతగా శ్రద్ద చూపడం లేదు. స్థానిక ఎమ్మెల్యేలను, అధికార పార్టీ లీడర్ల అనుచరులే ఇసుక మాఫియాను శాసిస్తుండడంతో కేసులు లేకుండానే జరిమానాలతో గడిపేస్తున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పై ఏసీబీ అదికారులు దాడి చేయడానికి అక్కడ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేయకపోవడంపై వచ్చిన అవినీతి, ఆరోపణలే కారణం. బాల్కొండ నియోజకవర్గంలోని అధికార పార్టీకి చెందిన రెండు గ్రూప్ ల లీడర్లు ఇసుక మాఫియా విషయంలో పరస్పర ఆరోపణలు చేసుకునే వరకు పరిస్థితి నెలకొంది. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లోని ఇసుక తవ్వకాలు అంతా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల అనుచరుల కనుసన్నుల్లోనే జరుగుతుందని అక్కడ ఇప్పటి వరకు పట్టపగలు జరిగే ఇసుక తవ్వకాల్లో, రాత్రివేళల్లో జరిగినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా ప్రభుత్వ పనుల కోసం, ప్రజల అవసరాల కోసం ఇచ్చిన వే బిల్లులు జిల్లా కేంద్రాలతో పాటు సరిహద్దులు దాటుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా  ఉందో  చెప్పవచ్చు.