. . . రెండు వీడియోల రూపకల్పన
. . . స్పెషల్ లోక్ అదాలత్ గూర్చి మీడియా విశ్రుత ప్రచారం కల్పించాలి
. . . విలేఖరుల సమావేశంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మీ
నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :
అవసరాల కోసం అప్పు తీసుకుని తమ బ్యాంక్ చెక్ ను పూచికత్తుగా ఇచ్చినవారు చెక్ బౌన్స్ కేసులను స్పెషల్ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడానికి దృష్టి సారించాలని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవ అధికార సంస్థ చైర్ పర్సన్ జీవిఎన్ భారత లక్ష్మీ అన్నారు. న్యాయస్తానాలలో విచారణ దశలో ఉన్న చెక్ బౌన్స్ కేసులను వేగవంతంగా పరిష్కరించే దిశగా జాతీయ న్యాయసేవల ప్రాధికార సంస్థ నాల్సా అడుగులు వేస్తున్నదని ఆ అడుగుల వెంట కక్షిదారుల అడుగులు పడాలని ఆమె ఆకాక్షించారు. జులై 18 న చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసమే స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కోర్టు సముదాయంలోని తన ఛాంబర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒక నిమిషం పన్నెండు సెకండ్ల నిడివి గల ఒక తెలుగు వీడియో, నలభై సెకండ్ల నిడివి గల మరొక ఇంగ్లిష్ వీడియో లను స్పెషల్ లోక్ అదాలత్ కోసం నాల్సా రూపకల్పన చేసిందని దానిని ప్రజా సమూహలలోకి తీసుకువెళుతున్నామని ఆమె తెలిపారు. స్పెషల్ లోక్ అదాలత్ గూర్చి మెయిన్ స్ట్రీమ్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విశ్రుత ప్రచారం కల్పించాలని కోరారు. చెక్ బౌన్స్ కేసులలో అప్పు తీసుకున్నవారు కోర్టు వాయిదాలకు రాకపోవడంతో వారిపైన 391 నాన్ బెయిలెబుల్ అరెస్ట్ వారంట్లు ఉన్నాయని తెలిపారు. సమస్య ఉంటుంది సమస్య వెనుక పరిష్కారం ఉంటుందని పరిష్కరించుకోవడంలోనే తెలివితేటలు ప్రదర్శించాలని అన్నారు. చెక్ బౌన్స్ కేసంటేనే డబ్బుతో ముడిపడి ఉంటుందని ముడిని విప్పుకునే నేర్పరితనం ఫిర్యాదుదారులలో, ముద్దాయిలలో ఉండాలని ఆమె పేర్కొన్నారు. పట్టువిడుపులు ఉంటే పరిష్కారం కానిదేముందని జిల్లాజడ్జి భారత లక్ష్మీ గుర్తు చేస్తూ చెక్ బౌన్స్ కేసులలో ఉన్న ఇరుపక్షాలు పట్టుదలకు పోకుండా స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డబ్బులు సర్దుబాటు చేసుకోలేని వారు జులై 18 న వీలుకాకుంటే, నవంబర్ 21 న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో తమ చెక్ బౌన్స్ కేసులను రాజీపద్ధతిన పరిష్కారం చేసుకోవడానికి సంసిద్దులుగా ఉండాలని అన్నారు. ఆర్థిక వ్యవహారాలు అనర్తాలకు దారి తీయరాదనే సంకల్పబలంతో నాల్సా స్పెషల్ లోక్ అదాలత్ సంకల్పం తీసుకున్నదని ఆమె వివరించారు.