Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 November 2025, 10:43 pm Posted by : ramakrishna

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి

  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ 

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాటిపల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిచ్ పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన నగేష్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. అయితే భూపతిరెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వగా ఆయన గెలుపు కోసం పని చేసిన నగేష్ రెడ్డికి డీసీసీ పదవి దక్కినట్లయింది. నగేష్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒకప్పుడు దివంగత నేత డి.శ్రీనివాస్ కు ప్రధాన అనుచరుడిగా పని చేశారు. రెండుసార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ గా సుదీర్ఘ కాలం పని చేశారు. నిజామాబాద్ జిల్లాలో డీసీసీ పదవి రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగడంతో నగేష్ రెడ్డితో పాటు చాలా మంది ఆశవాహులు పోటీ పడ్డారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు టీపీసీసీ కోశాధికారి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆశీస్సులతో నగేష్ రెడ్డికి పదవి దక్కినట్లయింది.

  • నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ..

నిజామాబాద్ సిటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా బొబ్బిలి రామకృష్ణ  నియమితులయ్యారు. నగరంలోని బొబ్బిలి వీధికి చెందిన రామకృష్ణ  కాంగ్రెస్ పార్టీకి కరుడుగట్టిన కార్యకర్తగా పేరు గడించారు. గతంలో ఎన్ ఎస్ యుఐ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.  ఎన్ ఎస్ యుఐ కార్యనిర్వాహక కార్యదర్శిగా 2004లో నియమితులై తర్వాత ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షులుగా పని చేశారు. యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా, పార్లమెంట్ యూత్ అధ్యక్షులుగా పని చేశారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా కరీంనగర్, ఆదిలాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా పని చేశారు. 2022 నుంచి నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్ గా పని చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెడ్డి సామాజిక వర్గానికే కేటాయిస్తే నగర కాంగ్రెస్ కాపు సామాజిక వర్గానికి ఇస్తారని ముందుస్తుగానే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగా డీసీసీ రెడ్డిలకు కేటాయించగా నగర కాంగ్రెస్ బొబ్బిలి రామకృష్ణను వరించింది. పీసీసీ అధ్యక్షుడి అనుచరుడిగా బొబ్బిలి రామకృష్ణకు పదవి దక్కినట్లయింది.

  • కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏలే మల్లిఖార్జున్..

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఏలే మల్లిఖార్జున్ కు వరించింది. నిజాంసాగర్ మండల కేంద్రంకు చెందిన ఏలే మల్లిఖార్జున్ ప్రస్తుతం మండల పార్టీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. గతంలో ఎన్ఎస్ యుఐ మండలాధ్యక్షుడిగా, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా పని చేశారు. మొన్నటి వరకు నిజాంసాగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పని చేశారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పెత్తనం కోసం షబ్బీర్ ఆలీ , అటు మధన్ మోహన్ ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి జుక్కల్ నియోజకవర్గానికి దక్కింది. మధన్ మోహన్ ఏలే మల్లిఖార్జున్ కు పదవి ఇప్పించడంలో తోటతో కలిసి పని చేశారని ప్రచారం జరుగుతుంది.