Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 10:12 am Posted by : ramakrishna

5.6 అడుగుల అమ్మాయిలే కావాలి

 

. . .  శరీరంపై మచ్చలు ఉండకూడదు

 

. . .  పూజల పేరిట యువతులపై అఘాయిత్యాలు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

లక్ష్మీపూజ చేస్తే లక్షలాది రూపాయలు వచ్చి పడతాయని నమ్మించారు. పూజలో పాల్గొంటే ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయని ఆశ చూపించారు. పూజల పేరుతో యువతులకు వల వేసి, చివరకు వారిని లైంగిక దోపిడీకి గురిచేస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టును కర్ణాటక పోలీసులు రట్టు చేశారు. దాదాపు రెండు నెలలపాటు రహస్యంగా నిఘా పెట్టి ఈ అక్రమ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేసి, నలుగురు మహిళలను రక్షించారు. పోలీసుల విచారణ ప్రకారం.. ఈ ముఠా ప్రధానంగా పెళ్లికాని యువతులను లక్ష్యంగా చేసుకుంది. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలను గుర్తించి, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుంది. ఓ స్వామీజీతో ప్రత్యేక లక్ష్మీపూజ చేయిస్తామని, ఆ పూజలో పాల్గొంటే భారీ మొత్తంలో డబ్బు వస్తుందని ఆశ చూపించింది. ఈ ముఠా యువతులను ఎంపిక చేసుకునేందుకు ప్రత్యేక ప్రమాణాలు కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉండాలి, శరీరంపై ఎలాంటి మచ్చలు లేదా గాయాల గుర్తులు ఉండకూడదని నిబంధనలు పెట్టినట్లు వెల్లడించారు. యువతుల సాధారణ ఫొటోలతో పాటు కుడిచేతి, కుడికాలి ఫొటోలను కూడా సేకరించేవారని తెలిపారు.

. . . ముగ్గురికి మూడు వాటాలు

యువతుల ఫొటోలు, వ్యక్తిగత వివరాలు సేకరించిన తర్వాత తమకు అనుకూలంగా ఉన్నవారిని ఎంపిక చేసుకునేవారు. లక్ష్మీపూజ ద్వారా భారీగా డబ్బు వస్తుందని, ఆ మొత్తాన్ని మూడు భాగాలుగా పంచుతామని నమ్మించేవారు. ఒక వాటా పూజలో పాల్గొన్న యువతికి, మరో వాటా పూజ నిర్వహించే స్వామీజీకి, మూడో వాటా యువతిని తీసుకొచ్చిన ఏజెంట్‌కు చెందుతుందని చెప్పేవారు. అయితే ఈ పూజలన్నీ మహిళలను వలలో వేసుకునేందుకు వేసిన ఎత్తుగడలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూజ పేరుతో యువతులను నగ్నంగా ఫొటోలు, వీడియోలు తీయించేవారని దర్యాప్తులో వెల్లడైంది. మత విశ్వాసాలు, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని మహిళలను లైంగికంగా దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.