- సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, బతుకమ్మ : అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు) లకు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి “భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని” ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కొత్తగా నియమితులైన మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములైన మీరు, ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది. భూభారతిని అమలు చేయడమే కాకుండా సాదా బైనామా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చాం. పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామ పాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందుకు గాను 5 వేల పైచిలుకు గ్రామ పాలనాధికారులను నియమించాం. సాదా బైనామాకు సంబంధించి ఎనిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు. జాగ్రత్తగా పరిష్కరించాలి. ఇది ఉద్యోగం కాదు. మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇదొక భావోద్వేగం. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయి. ఆ సమస్యలు పరిష్కరించడానికి వీలులేకుండా వీఆర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అధికారాలను తప్పించారు. తద్వారా సమాధానం చెప్పలేక మీరు సమాజంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారు. ఎవరో కొందరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా. ఆనాడు ఎవరిని కదిలించినా ఈ ధరణి అనే ఒక భూతం పట్టి పీడించిందని చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చాం. ధరణి అనే మహమ్మారిని అంతం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని వేశాం. భూభారతి 2025) చట్టం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశాం.
