- కమిషనర్ కు వినతిపత్రం అందజేత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టియుసిఐ, సిఐటియు, ఏఐటియుసి సంఘాల బాధ్యులు మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు, టీయుసీఐ జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమం పేరుతో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులతో ఆదివారం, పండగ సెలవులు కూడా ఇవ్వకుండా పనిచేయిస్తున్నారన్నారు. ఒకవైపు వర్షాలు కురుస్తుండడం, తగిన పనిముట్లు, భద్రతా పరికరాలు లేకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సెలవులు లేకుండా విధులు నిర్వహిస్తున్న కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. కార్మికులకు పనిముట్లు, రైన్ కోట్లు గ్లౌజులు, బూట్లు ఇవ్వలేదన్నారు. పర్మినెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు కూడా అన్ని రకాల పనిముట్లు, భద్రత పరికరాలు అందివ్వాలన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ ఐడీ కార్డులు ఇవ్వాలన్నారు. డిమాండుకు సరిపడా కార్మికుల సంఖ్య లేకపోవడంతో కార్మికులపై అధిక పనివారం పడుతుందన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ ఆదివారం, పండగ సెలవులు అమలు చేస్తామని, ఐడి కార్డులు, పనిముట్లు కార్మికులందరికీ త్వరలోనే అందజేస్తామని, మిగతా సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింగరావు నాయకులు ఫిరోజ్ అలీ తదితరులు పాల్గొన్నారు.