Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 7:54 pm Posted by : ramakrishna

మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

 

. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు డిమాండ్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వివిధ విభాగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పైన మున్సిపల్ కమిషనర్ తో చర్చించి వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులకు సరిపడా పనిముట్లను సకాలంలో అందించకపోవడంతో కార్మికుల తమ సొంత డబ్బుల్ని పెట్టుకొని వాటిని కొనుగోలు చేసి వాడుతున్నారని అందువల్ల కార్మికులకు చీపుర్లు, పారలు, టార్చిలైట్లను అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగానికి పనిముట్లను అందించాలని అన్నారు. కార్మికులకు సబ్బులు నూనెలు సంవత్సరానికి రెండు జతల బట్టలు, షూస్ అందించాల్సి ఉన్నప్పటికీ వాటిని రెగ్యులర్గా అందించటం లేదని, పట్టణ విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతున్నందున పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి కార్మికులపై పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. సేకరణ ఆటోలు,  ట్రాక్టర్లు చాలా వరకు చెడిపోయి పనికి రాకుండా మారుతున్నాయని చెత్త సేకరణలో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందువల్ల సరిపడా చెత్త బండ్లను కొనుగోలు చేయాలని, మెకానిక్ షెడ్డు ను ఏర్పాటు చేయాలని గతంలో పెంచిన వెయ్యి రూపాయల వేతనాన్ని చెల్లించాలన్నారు. చనిపోయిన కార్మికుల అంత్యక్రియల ఖర్చులు 20000 రూపాయలు చెల్లించటంలో మున్సిపల్ యంత్రాంగం విముఖత చూపుతున్నదని అంత్యక్రియల ఖర్చులను చెల్లించటం తో పాటు చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆయనన్నారు. కార్మికుల బకాయి వేతనాలు అడిగిన వారి పైన, సమస్యలను ప్రశ్నించిన వారి పైన అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ఏడుగురితో ఒక గ్రూపును సొసైటీగా ఏర్పాటు చేసుకోవాలని  అధికారులు ఒత్తిడి తెస్తున్నారని వీటి మూలంగా కార్మికుల పై పని భారం పెరగటంతో పాటు గ్రూప్ లీడర్లు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని అందువల్ల 50 నుంచి 100 మంది కార్మికులతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి కార్పొరేషన్ వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. పై సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించి న్యాయం చేస్తామని కమిషనర్ హామీ ఇవ్వడం జరిగిందని ఆయనన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నాయకులు సహదేవ్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.

Municipal workers' problems should be resolved