. . . టీయుసీఐ, సిఐటియూ, ఏఐటియుసి సంఘాల డిమాండ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
మున్సిపల్ కార్మికుల సిఐజి గ్రూపులను కొనసాగించాలని, ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీయుసీఐ, ఏఐటియుసి, సిఐటియు సంఘాల నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ.రమేష్ బాబు లు మాట్లాడుతూ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య విభాగంలో ఔట్ సోర్సింగ్ కార్మికులతో ఇప్పటికే కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (సిఐజి) ఉన్నాయన్నారు. ఇవి కాకుండా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలో 330 మంది కార్మికులు ఉన్నారని, ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను రద్దుచేసి కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలనుకోవడం సరైంది కాదన్నారు. అందువల్ల పనిభారం పెరుగుతుందని, ఇప్పటికే ఉన్న సిఐజి గ్రూపులను కొనసాగిస్తూ, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ 330 మంది కార్మికులను 20 నుండి 25 మందితో ఒక గ్రూపుగా ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. అదే విధంగా ఔట్ సోర్సింగ్ కార్మికులందరికీ యూనిఫామ్, సబ్బులు, నూనెలు, రక్షణ పరికరాలు ఇవ్వాలని, కేటగిరీల వారీగా ఇతర మున్సిపల్ కార్పొరేషన్ లో ఇస్తున్నట్లు వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐలలో ఉన్న తప్పులను సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయుసీఐ జిల్లా నాయకులు రాజేశ్వర్, కిరణ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.