. . . నిజామాబాద్ మేయర్ కు ఉద్యోగుల సమ్మె నోటీసు
. . . ఈ నెల 8 నుంచి నిరసనకు పిలుపు
నిజామాబాద్ , బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు నిజామాబాద్ డిస్ట్రిక్ యూనిట్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు సిద్దమౌతున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం గత నెల 22న శాంతియుత ధర్నా నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే అధికారుల నుంచి ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణికి సమ్మె నోటీసును అందించారు. ఈ నెల 8న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ లో నిరసనతో ప్రారంభించి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

తెలంగాణ వ్యాప్తంగా ప్రధానంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో గత కొన్ని సంవత్సరాలుగా డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లేక ఔట్ సోర్సింగ్ ప్రతిపాదికనే ఉద్యోగుల నియామకాలు జరుగుతున్నాయి. అందులో పారిశుధ్ద్య కార్మికులు, పారిశుద్ద్య కార్మికేతరుల ఉద్యోగుల నియామకాలు అంతా ఔట్ సోర్సింగ్ ద్వారానే జరుగుతున్నాయి. దాదాపు దశాబ్ధ కాలంగా బల్ధియాలో నియామకాలు నిలిచిపోవడంతో ఔట్ సోర్సింగ్ పద్దతిలో పని చేస్తున్న వారికి ఉద్యోగ భద్రత లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతన ఆంతర్యం చాలా ఉంది. ఈ నేపథ్యంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ద్వారా జారీ చేయబడిన జీవో ఎం.ఎస్.నం.52(2018) ప్రకారం అమలు చేస్తున్న పారిశుద్ద్య కార్మికుల గ్రూప్ ద్వారా వేతనాలు చెల్లింపులతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత జీవో ప్రకారం ఏడుగురు కార్మికులకు ఒక గ్రూప్ ఏర్పాటు చేసి వారికే గ్రూప్ అటెండెన్స్ ద్వారా వేతనాల చెల్లింపులు జరుగడం ఇబ్బందిగా మారిందన్నారు. రాష్ట్రంలో ఇతర ఏ శాఖలో లేని విధంగా కేవలం మున్సిపాలిటీలోనే గ్రూప్ విధానంతో వేతనాలు చెల్లింపులు జరుగడం కార్మికులకు కొత్త కష్టాలు తెస్తుందని వాపోతున్నారు.

ప్రధానంగా బల్ధియాలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళనలో ప్రధాన డిమాండ్ జీవో 52ను రద్దు చేయాలని, కార్పొరేషన్ ద్వారానే వేతనాలు ఇవ్వాలనేది తెరపైకి తీసుకువచ్చారు. ప్రతి నెల 1 నుంచి 5వ తేదిలోపు వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు. బల్ధియాలో పని చేస్తూ చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక వయస్సును 40 సంవత్సరాల నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో కార్పొరేషన్ అధికారులకు తమ డిమాండ్లపై వినతి పత్రం సమర్పించినా స్పందన లేకపోవడంతోనే నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. గత నెలలో ఒక రోజు బల్ధియా కార్మికులు ఆందోళన చేస్తేనే మున్సిపాలిటీ అస్తవ్యస్తం అయింది. ఒకవేళ వారు నిరవధిక సమ్మె చేస్తే సమ్మె మాత్రం పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం, అధికార యంత్రాంగాలు ఔట్ సోర్సింగ్ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని ప్రతిపాదన ప్రజల వద్దకు చేరనుంది.