Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 7:53 pm Posted by : ramakrishna

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి

 

. . . జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి హాజరైన సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్ తో కలిసి కలెక్టర్ సోమవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీకి చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించి, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ తో పాటు స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ళను పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తగా ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేయాలని, నిర్ణీత సమయానికి ఎన్నికల సిబ్బంది అందరూ వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాళ్ల వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రతతో పాటు సీ.సీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని, అనుకోని రీతిలో ఏదైనా అగ్ని ప్రమాదం వంటివి సంభవిస్తే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు, మరుగుదొడ్లు, షామియానా వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా కల్పించాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తు.చ తప్పక పాటించాలన్నారు. పోలింగ్ సామాగ్రి పంపిణీ సమయంలో చెక్‌లిస్టు ప్రకారం అందజేయాలని, పోలింగ్ రోజున ఓటర్లకు ఇబ్బందులు లేకుండా అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, గట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉండేలా చూడాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత నడుమ స్ట్రాంగ్ రూంలకు తరలించి, కౌంటింగ్ రోజున నిబంధనల ప్రకారం ఓట్ల లెక్కింపు జరపాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ బాక్సులను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లకు వేసిన సీళ్లను, పోలీసు బందోబస్తును కలెక్టర్ పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ ప్రక్రియలను దృష్టిలో పెట్టుకుని పాలిటెక్నిక్ కళాశాలలోని వివిధ గదులతో పాటు, పరిసరాలను కూడా శుభ్రం చేయించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ను ఆదేశించారు. ఇదిలా ఉండగా, క్షేత్రస్థాయి పరిశీలనకు ముందు సెక్యూర్ సెల్ ఆఫీసర్ మంద మకరంద్ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ లు అంకిత్, కిరణ్ కుమార్, ఎన్నికల పరిశీలకులు సీహెచ్.సత్యనారాయణ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలినా చింగ్తియాన్ మావిలతో కలిసి నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.  డిస్ట్రిబ్యూషన్, పోలింగ్ , కౌంటింగ్ ప్రక్రియలపై దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలను పూర్తి పారదర్శకతతో, తప్పిదాలకు తావు లేకుండా నిర్వహించాలని మంద మకరంద్ సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు తదితరులు ఉన్నారు.

 

 

Municipal elections should be conducted smoothly.
Municipal elections should be conducted smoothly.
Municipal elections should be conducted smoothly.