Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 March 2026, 8:26 pm Posted by : ramakrishna

రేపు మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం

 

. . . కొత్త పాలకవర్గంలో మొదటి బడ్జెట్

 

. . . హాజరుకానున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం శనివారం జరుగనుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త బడ్జెట్ ను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. మరో మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో బడ్జెట్ ప్రవేశపెట్టడం తప్పనిసరి అయింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగి కొత్త కార్యవర్గం ఎన్నికైనప్పటికీ ఇప్పటి వరకు సాధారణ సమావేశాలు నిర్వహించలేదు. నిజామాబాద్ మేయర్ గా నియమితులైన కూరగాయల ఉమారాణి రాజకీయాలకు కొత్త కావడంతో బడ్జెట్ తయారి, ఆమోదం కోసం కొన్ని రోజులుగా అధికారులు కసరత్తులు చేశారు. 2025-26 మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.100 కోట్లకు పైగా ఉండగా కొత్త బడ్జెట్ దానిని మించనుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు పాలకవర్గం లేక ఏడాది కాలంగా గ్రాంట్లు, ఇతర ఆదాయ మార్గాలు లేక కేవలం పన్నులతోనే వచ్చే ఆధాయంతో సరిపెట్టుకుంది. అవి కూడా మున్సిపల్ ఉద్యోగుల వేతనాలకే సరిపోయాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఏకైక మున్సిపల్ కార్పేరేషన్ బడ్జెట్ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఐదేళ్ళ కాలపరిమితికి ఎన్నికైన కొత్త పాలకవర్గం ఆధ్వర్యంలో తయారు చేయనున్న బడ్జెట్ పై చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజామాబాద్ అర్బన్ లో బీజేపీ ఎమ్మెల్యేగా ధన్ పాల్ సూర్యనారాయణ ఎన్నికైనప్పటి నుంచి కేవలం సీడీపీ నిధుల మినహా ఇతర నిధులు ఏవి మంజూరు కాలేదు. కాంగ్రెస్ పార్టీ బల్ధియా ఎన్నికలకు ముందు  ప్రతీ డివిజన్ కు రూ.20 లక్షల చొప్పున కేటాయించిన నిధులు మినహా ఇతర నిధులు ఏమి లేకపోవడంతో వచ్చిన నిధులతోనే డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణాలు చేపట్టారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో దశాబ్ధం తర్వాత పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ లో తనదైన ముద్ర కోసం పరితపిస్తోంది. నిజామాబాద్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు దానిపై తన పట్టును నిలుపుకుంటున్న పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బడ్జెట్ తయారి మొదలుకుని ఆమోదంపై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలిసింది. కొత్త పాలకవర్గానికి సలహాలు, సూచనలు చేయడంతో పాటు అధికారులకు బడ్జెట్ లో నిజామాబాద్ కార్పొరేషన్ కు సరిపడా ఉండాలని ఆ  కోణంలోనే తయారు చేయాలని సూచించినట్లు తెలిసింది. మూడు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఆధాయం , వ్యయ వివరాలతో పాటు కొత్తగా కార్పొరేషన్ పరిధిలో చేపడుతున్న పనులకు సంబంధించిన డీపీఆర్ ద్వారా బడ్జెట్ తయారికి కసరత్తు జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన మజ్లీస్ అండదండలు ఉన్నప్పటికీ బడ్జెట్ పై బీజేపీ నిలదీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల ఫలితాల సమయంలో సమర్థవంతమైన ప్రతిపక్ష పాత్ర పోశిస్తామని ప్రకటించిన ఎంపీ అర్వింద్ అన్నట్లుగానే బడ్జెట్ సమావేశాల కు ఒక రోజు ముందే ఫ్లోర్ లీడర్, ఇతర కార్యవర్గాన్ని నియమించారు. బీజేపీ బడ్జెట్ పై అధికారులను, పాలక పక్షాన్ని  నిలదీసే అవకాశాలున్నాయి. నిజామాబాద్ డెవలప్ మెంట్ కు పరాకాష్ట అయిన మాస్టర్ ప్లాన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు ఉంటాయా లేదా అన్న సంశయాలు వ్యక్తమౌతున్నాయి. బల్ధియాకు ఆదాయం లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే భారం ఉంది. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక్క అంశం కూడా లేకపోవడం విశేషం. ఈ నేపథ్యంలో నిజామాబాద్ లో నూతనంగా బస్టాండ్ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ వ్యవహరాన్ని ప్రత్యేక ఫండ్ కింద తెప్పించే ప్రయత్నాలు జరుగుతాయా ఈ విషయంలో పాలకవర్గం ప్రభుత్వానికి తాము సిఫారసు చేస్తుందా అన్న అనుమానాలున్నాయి. కొత్త బడ్జెట్ పై నూతన పాలకవర్గం వ్యవహరం ఆమోద విషయంలో శనివారం జరిగిన సమావేశంలో సంశయాలు, అనుమానాలు పటాపంచలయ్యే అవకాశం ఉంది.